విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ సారధ్యంలో డిప్యూటీ మేయరు అవుతు శ్రీ శైలజ, యం. ఎల్. సి శ్రీ యం. డి రూహుల్లా, టి.డి.పి కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ లతో కూడిన కార్పొరేటర్ ల బృందం ఢిల్లీ నగరపాలక సంస్థ కార్యాలయమును సందర్శించి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంలో ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలైన త్రాగు నీరు, పారిశుధ్యo, డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు మొదలగు అంశాలతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ క్రింద అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ల నిర్వహణ మరియు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకములను అధికారులు బృంద సభ్యులకు వివరించారు. విజయవాడ నగర ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు అమలు చేస్తున్న సంస్కరణలను మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకములను ఫ్లోర్ లీడర్ మరియు డిప్యూటీ మేయరు , యం.ఎల్.సి అక్కడి అధికారులకు వివరించి నగరపాలక సంస్థ తరుపున జ్ఞాపికను ఢిల్లీ అధికారులకు అందజేశారు.
తదుపరి ఢిల్లీ కార్పొరేషన్ వారు ప్రతిష్టాత్మకంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పరచి ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన స్క్రాప్ పార్క్ ను సందర్శించినారు. పార్కు నిర్వహణ విధానమును అక్కడి అధికారులు వివరిస్తూ, సోలార్ ద్వారా విద్యుత్ దీపాలు, సి. సి కెమెరాల ఏర్పాటు, నిర్వహణ తీరు వివరిస్తూ, సుమారుగా 350 టన్నుల స్క్రాప్ వినియోగించుట జరిగిందని వివరించారు. పర్యటనలో వై. సి. పి కార్పొరేటర్లు, టి. డి. పి కార్పొరేటర్లు మరియు వి. ఏ. ఎస్ డా. రవి చంద్ తదితరులు పాల్గొన్నారు.