Breaking News

సంక్షేమానికి రోల్ మోడల్ సీఎం వైఎస్ జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-25వ డివిజన్ 95 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకెంతో లబ్ధి చేకూరుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ – 95 వ వార్డు సచివాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట ఆదరణ లభించింది. వార్డు సచివాలయ పరిధిలోని 1,127 గృహాలలో, 270 ఇళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. దుర్గా అగ్రహారం, బోడేపూడి వారి వీధి, అయ్యంనాయుడు వీధి, లిక్కీ పుల్లయ్య వీధులలో పర్యటించి ప్రజల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. చివరి గడప వరకు ఒక్కో కుటుంబానికి రెండు అంతకన్నా ఎక్కువ పథకాలు అందేలా ప్రజలను చైతన్యపరుస్తున్న సచివాలయ సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. అర్హత ఉండి పథకాలు వర్తించని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న రెండు ప్రధాన సమస్యలను గుర్తించడం జరుగుతోందని.. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వం 95 సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 4.13 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ విధానంలో అందించడం జరిగిందని మల్లాది విష్ణు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 275 మందికి ప్రతినెలా రూ. 21.20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా 65 మందికి రూ. 12.18 లక్షలు., కాపు నేస్తం ద్వారా 29 మందికి రూ. 4.35 లక్షలు., అమ్మఒడి ద్వారా 222 మందికి రూ. 27.15 లక్షలు., విద్యాదీవెన ద్వారా 121 మందికి రూ. 8.76 లక్షలు., వసతి దీవెన ద్వారా 69 మందికి రూ.4.50 లక్షలు., వాహనమిత్ర ద్వారా 20 మందికి రూ. 2.00 లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 361 మందికి రూ. 34.66 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.

ప్రత్యేక హోదాను అటకెక్కించింది చంద్రబాబే
ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందంటే.. అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్యాకేజీ కోసం గత పాలకులు ఆంధ్రుల ఆత్మాభిమాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని.. దిగజారిపోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్ సీపీ పోరాటంతో హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్, విభజన హక్కులు సాధించడానికి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోందని తెలిపారు. ప్రధానమంత్రిని కలిసిన ప్రతీసారి ఆంధ్ర రాష్ట్రానికి హోదా ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరుతున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారని చెప్పారు. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అంటూ లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి నిధులు రాబట్టే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ చేస్తుంటే.. ఆ నిధులను అడ్డుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు.

జనసేన నాయకుల విమర్శలు అర్థరహితం
కౌలు రైతు ఆత్మహత్యలపై జనసేన నేతల వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునే దుస్థితి రాకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ ఈ ప్రభుత్వం అందజేయడం జరిగిందన్నారు. ఈమేరకు 2019 అక్టోబర్‌ 14న జీవో 102 జారీ చేసినట్లు తెలిపారు. కానీ కనీస అవగాహన లేకుండా జనసేన నాయకులు మాట్లాడుతున్నారని.. ధైర్యం ఉంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, నాయకులు బంకా భాస్కర్, కుక్కల రమేష్, మానం గంగాధర్, మానం వెంగయ్య, దేవినేని సుధాకర్, రఫీ, చినబాబు, ఆలీ, అబ్దుల్ నజీర్, నాగేశ్వరరెడ్డి, పుల్లయ్య, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *