-ప్రొబేషన్ డిక్లరేషన్ పై వార్డు సచివాలయ ఉద్యోగుల హర్షాతిరేకాలు
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకంలో సచివాలయం వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని.. గుడ్ గవర్నెన్స్ కు కేంద్ర బిందువుగా మారిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 25వ డివిజన్ లోని 95వ వార్డు సచివాలయ కార్యాలయంలో శుక్రవారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. కొత్త పే స్కేల్ ద్వారా ఒక్కో సచివాలయ ఉద్యోగికి దాదాపు రూ. 30 వేలు జీతం అందుతుందని మల్లాది విష్ణు అన్నారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. రచ్చబండ కార్యక్రమంతో మూడు నెలలకోసారి అధికార యంత్రాంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు. కానీ ఆ మహానేత మరణంతో ఆయన ఆశయాలన్నీ మరుగున పడ్డాయన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ కలలు కన్న స్థానిక సుపరిపాలనను సచివాలయ వ్యవస్థ రూపంలో సాకారం చేసి చూపారన్నారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ప్రతి 2వేల మంది జనాభాకు ఒక సచివాలయంతో పాలన మరింత సుగుమం అయిందన్నారు. కనుకనే దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రంలో పర్యటించి.. ఈ వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ సైతం వ్యవస్థను కీర్తించడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత అంకిత భావంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రొబేషన్ డిక్లేర్ చేయడంపై ఉద్యోగులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు బంకా భాస్కర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.