Breaking News

బాధితుల కళ్ళలో కనబడే కృతజ్ఞత .. ఉద్యోగి జీవితంలో సంతృప్తి

-సమస్య గుర్తించి పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన లో పలుమార్లు అర్జీలు ఇస్తూ అలసిపోకుండా తిరుగుతున్న కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి నివాసి వెలగం శివ పార్వతి అనే పేదరాలి సమస్యను సానుభూతితో విని మానవత్వంతో తక్షణమే పరిష్కరించిన కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకు ఇటు అధికారులు అటు బాధితురాలి మన్నలను పొందారు.
కూచిపూడిలో నివసించే శివపార్వతి తన భర్త ప్రసాద్ , ఇద్దరి పిల్లలతో నివసిస్తూ ఉంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమెను ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టి కుటుంబ పోషణ కడుబారమైంది. వైఎస్సార్ బీమా పథకం కింద రెండు లక్షల’ రూపాయిలు ఆమె పేరిట బ్యాంకు ఖాతాలో జమ కావాల్సివుంది. అయితే ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆమెకు బీమా సొమ్ము దక్కలేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సమస్య విషయం ఉన్నతాధికారులకు విన్నవించుకొందామని స్పందన కార్యక్రమం జరిగే ప్రతి సోమవారం క్రమం తప్పకుండ వస్తూనే ఉంది. అర్జీ అధికారులకు అందచేస్తూనే ఉంది. డి ఆర్ డీ ఏ అదికారులు స్పందించినప్పటికీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాలేదు . కేవలం రెండుసార్లు తనకు అర్జీ ఇచ్చిన వెలగం శివ పార్వతి సమస్య పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని నేరుగా సెర్ప్ సి ఇ ఓ ఏయం.డి. ఇంతియాజ్ దృష్టికి తీసుకుని వెళ్ళారు.సామాన్య ప్రజల సమస్యలు అంటే ఇట్టే స్పందించే ఇంతియాజ్ ఆయన ఆన్లైన్ లో వెలగం శివ పార్వతి కు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు.
ఈ నగదు మొత్తాన్ని 4 సార్లు ఆమె ఖాతాలో రెండు లక్షల రూపాయిలు డిపాజిట్ చేస్తున్నప్పటికీ జన్ దన్ బీమా ఖాతా అయినందున ఆ మొత్తం వెనక్కి తిరిగివస్తున్నట్లు గుర్తించారు. ” జన్ ధన్ ‘ ఖాతా కు కేవలం 50 వేల రూపాయలు వరకు మాత్రమే జమావుతాయి. అసలు సమస్యకు జన్ దన్ ఖాతా నే కారణమని గుర్తించిన కలెక్టర్ రంజిత్ బాషా ఆ రెండు లక్షల రూపాయలను చెక్ రూపంలో చెల్లించమని సెర్ప్ సిఇఓను కోరారు. ఆ విధంగా ఆమెకు 2 లక్షల రూపాయల చెక్కును రంజిత్ బాషా సోమవారం స్పందన మీటింగ్ హాల్లో వెలగం శివ పార్వతికి అధికారులు అధి కారులందరి సమక్షంలో అందచేశారు. ఆ చెక్కును అందుకొన్న ఆమె కళ్ళలో కన్నీరు ఉబికింది. ఆమె ఎంతో కృతజ్ఞతతో కలెక్టర్ కు నమస్కారం చేసి మీరు చొరవ చూపకపోయి ఉంటే, కొన్నాళ్లకు నేను ఈ డబ్బు ఇక రాదనీ వదిలేద్దామని నిర్ణయించుకున్నానని గద్గద స్వరంతో కలెక్టర్ రంజిత్ బాషాకు తెలిపింది. మాబోటి నిరుపేదలకు సహాయం చేస్తున్న మీరు చల్లగా ఉండాలని దీవెనలను అందించింది.
అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులతో మాట్లాడుతూ, సామాన్య ప్రజలు తమకు తెలిసి తెలియని జ్ఞానంతో పొరబాట్లు చేస్తుంటారని అవి గుర్తించబడకపోవడంతో ఏళ్ళ తరబడి వివిధ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారని అందుకు ఒక ఉదాహరణగా కూచిపూడి నివాసి వెలగం శివ పార్వతి నిలుస్తుందన్నారు. అధికారులు అసలు సమస్య ఎక్కడ ఉందని నిశితంగా పరిశీలించి పరిష్కార అన్వేషణ చేయాలన్నారు. వారి ఇబ్బందులు తొలిగి వారి సమస్య పరిష్కారం కాబడినపుడు బాధితుల కళ్ళలో కనబడే కృతజ్ఞత మన ఉద్యోగ జీవితంలో ఎంతో సంతృప్తి ఇస్తుందని అన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *