-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్‌లో ఘనంగా 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
-యువతతో పోటీ పడుతూ ఉత్సాహంగా యోగా చేసిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప సంపద అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వతేదీని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు యోగా దినోత్సవాన్ని ఆచరించటం భారత్ కు గర్వకారణమన్నారు. గత 35 సంవత్సరాలుగా తాను యోగాను క్రమం తప్పకుండా అభ్యసిస్తున్నానని శరీరానికి, మనస్సుకు, ఆత్మకు యోగ సాధన ప్రశాంతతను అందిస్తుందన్నారు. యోగాను క్రమం తప్పకుండా సాధన చేయట ద్వారా ఒత్తిడి లేని జీవితాన్ని అస్వాదించగలుగుతామన్నారు. యోగాధ్యయనం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, కరోనా వంటి వైరస్ వ్యాధుల నుండి రక్షణను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా మాట్లాడుతూ యోగా అనేది ఆరు సనాతన తత్వశాస్త్రలలో ఒకటి కాగా, ఇది వేదాల నుండి ఉద్భవించిందని, భగవంతుడిని సన్నిధిని చేరుకోవడానికి యోగా ఒక మార్గమని పేర్కొన్నారు. యోగాలోని ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానంలను క్రమం తప్పకుండా ఆచరిస్తే అది సాధకుడికి, అతని కుటుంబానికి, చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో మేలు చేస్తుందని సిసోడియా వివరించారు. యోగా శిక్షకులు ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగాసనాలు సాధన చేసారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్, యోగ అదిగురువు మహర్షి పతంజలి చిత్రపటానికి పుప్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.