-31వ డివిజన్ 213 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక స్వర్ణయుగంగా సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 31 వ డివిజన్ – 213 వ వార్డు సచివాలయం పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. టీచర్స్ కాలనీ, జెండా చెట్టు వీధి, అంబటి వారి వీధులలో విస్తృతంగా పర్యటించి.. సుమారు 398 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సంక్షేమ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక లబ్ధిపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గత నెలన్నర రోజులుగా పలు డివిజన్లలో పర్యటిస్తుండగా.. ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ఉన్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. అనంతరం ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీలలో 3 రోడ్లు మంజూరయ్యాయని.. వారం, పది రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు.
పర్యటనలో భాగంగా ఆటో డ్రైవర్లతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు ముచ్చటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని జగనన్న ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పన్నులు, ఛలానాల రూపంలో నడ్డి విరిచిందని గుర్తుచేశారు. కానీ ఆటో డ్రైవర్ల కష్టాలు, బాధలు పాదయాత్ర ద్వారా గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వారిని ఆదుకునేందుకు 2017 మే మాసంలో ఏలూరులో వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారన్నారు. మాట ఇచ్చిన చోటే 2019 అక్టోబర్ 4న పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున అందజేశారన్నారు. 2020లో కరోనా నేపథ్యంలో నాలుగు నెలల ముందే జూన్ 4వ తేదీన పథకాన్ని అందజేశారని తెలిపారు. వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్ నెస్ ఫీజులను చెల్లించేందుకు జగనన్న అందిస్తున్న ఈ సాయం దోహదపడుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై 13న వాహనమిత్ర పథకం డబ్బులు వ్యక్తిగత ఖాతాలలో జమ అవుతాయని.. కనుక లబ్ధిదారులు ఈ సాయాన్ని ఉపయోగించుకుని వాహనాలను ఎప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలని సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఒక్కటే ప్రామాణికమని వివరించారు. జూన్ 27వ తేదీన అమ్మఒడి, జూలై 5 న జగనన్న విద్యాకానుక, జూలై 13న వాహనమిత్ర, జూలై 22 న కాపునేస్తం, జూలై 26 న జగనన్న తోడు పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మిగిలిపోయిన లబ్ధిదారుల కోసం జూలై 26 న రాష్ట్ర ప్రభుత్వం వారివారి వ్యక్తిగత ఖాతాలలో నిధులు జమ చేస్తుందని వెల్లడించారు. కనుక పథకాలకు అర్హత ఉండి, వివిధ సాంకేతిక లోపాల వల్ల పథకాలు రానివారు సచివాలయాలను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్ మినహా 80 శాతం మంది పేద, మధ్య తరగతి ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మల్లాది విష్ణు తెలిపారు. అమ్మఒడికి సంబంధించి ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా 5,48,329 మంది తల్లులకు పథకం వర్తించనున్నట్లు వెల్లడించారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. తెలుగుదేశం నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలపై పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న బెదరింపు ధోరణి బాధాకరమని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయవాడ నగరంలో పోలీసు అధికారులపై దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. అలాగే రాష్ట్ర అప్పుల గూర్చి మాట్లాడే ముందు తెలుగుదేశం హయాంలో ఉన్న రూ. మూడున్నర లక్ష కోట్ల అప్పులతో పాటు కాంట్రాక్టర్లకు పెట్టిన రూ. వేల కోట్ల బకాయిలపై టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు భోగాది మురళి, బెజ్జం రవి, సామంతపూడి గోవిందరాజు (చిన్నా), పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, పెరుమాళ్ల జయకర్, గుండె సుందర్ పాల్, అంగిరేకుల విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.