మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ సంపదలు అక్కరకు రావని,శాశ్వతంగా ఉండేది విద్య , విజ్ఞానం మాత్రమేనని వాటిని విద్యార్థినీ విద్యార్థులు అందిపుచ్చుకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యులుదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి అమ్మఒడి 3 వ విడత కార్యక్రమం నేరుగా తల్లుల ఖాతాలోకి 13 వేల రూపాయలను బటన్ నొక్కి నేరుగా పంపించారు. 75 శాతం హాజరు ఉండాలని ఆ జీవోలోనే పొందుపర్చామన్నారు. హాజరు శాతం తగ్గడంతోనే 51 వేల మందికి అమ్మఒడి ఇవ్వలేదని, మొత్తంగా 1.14 శాతం మంది తల్లులకు అమ్మఒడి పథకం ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తనకు బాధగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్‌లో ఇది పునరావృతం కాకుండా పిల్లల్ని బడికి పంపాలని తల్లులకు సూచించారు. జడ్పి కనేవెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమానికి హాజరైన తల్లితండ్రులు, విద్యార్థిని విదార్థులు బిగ్ స్క్రీన్ పై వీక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చిన్నారుల విద్య కోసం వారి అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ సి ఎం జగన్మోహనరెడ్డి మాదిరిగా పాటు పడిన దాఖలాలు లేవన్నారు. విద్యార్థులను బడి బాట పట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేలు జమ చేస్తోందని వరుసగా 3 వ దఫా ఈ ఏడాది అమ్మఒడి నిధులను విడుదల చేయడం ఎంతో హర్షించదగ్గ చర్య అని మంత్రి జోగి రమేష్ అన్నారు. చదువుకు పేదరికం అన్నది అడ్డుకాకూడదు అనే సదుద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. ఒకప్పుడు కాన్వెంట్లలో తమ పిల్లలను ఎలాగైనా చదివించేందుకు తల్లితండ్రులు ఎంతో ఉబలాటపడేవారని, ప్రస్తుతం మెరుగుపడిన ప్రభుత్వ పాటశాలలో విద్యావిధానం, వసతులు, చిన్నారులకు అందిస్తున్న పోష్టికాహారం చూసి ఎందరో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో తమ బిడ్డలను చేర్చేందుకు తాపత్రయపడుతున్నారని, ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేందుకు స్థానిక శాసన సభ్యుల సిఫార్సుల కోసం ఎమ్మెల్యే కార్యాలయాల చుట్టూ తిరగడం గమనార్హం అన్నారు. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా నిధులు విడుదల చేయడం తప్పు ఎలా అవుతుందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. గతంలో పండుగలు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసేవాళ్ళం.. ఇప్పడు అమ్మఒడి పథకం, విద్యా దీవెన, వసతి దీవెన , కంటి వెలుగు, గోరుముద్ద, సంపూర్ణ పోషణలు మన పండుగల జాబితాలో చెరాయని ఆయన చెప్పారు.
తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుంచి అమ్మఒడి అనే అద్భుతమైన కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందన్నారు. రైతు భరోసా, వాహనమిత్ర తదితర ఎన్నో ప్రభుత్వ పథకాలతో సరిపోల్చితె, అమ్మఒడి పథకం విభిన్నమైనదని అన్నారు. విద్య అనేది ఒక గొప్ప కార్యక్రమం అని, ఈ సమాజంలో తల్లితండ్రులు తమ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆశిస్తారని, అయితే క్వాలిటీ గల విద్యను వారికి ఎలాగైనా అందివ్వాలని వారు ఆశ పడుతుంటారన్నారు.
అమ్మఒడి పథకం ద్వారా ఎందరో తల్లితండ్రులు తమ బిడ్డలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. చదువు మాత్రమే గొప్ప ఆస్తి అని అది మాత్రమే వెల కట్టలేనిదని ఏ ఒక్కరూ దొంగిలించనిదని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక పకడ్బంది వ్యూహంతో మన రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తును ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మరో ఐదారేళ్లలో ఈ విద్యార్థుల ఉన్నతి ఎంతో గొప్పగా ఉంటుందో మనమే ప్రత్యక్షంగా చూడవచ్చని ఎంపీ బాలశౌరి అన్నారు.
అనంతరం కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కాకుండా ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారందరికీ ప్రభుత్వం లబ్ది చేకూర్చారన్నారు. అమ్మఒడి పథకం కింద కృష్ణాజిల్లాలో 1 లక్షా 34 వేలమంది విదార్ధినీ విద్యార్థులకు 202 కోట్ల 35 లక్షల 30 వేల రూపాయలను వారి తల్లుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.13 వేలు జమకానున్నాయిని . ఈ పథకం ద్వారా అందించే మొత్తంలో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ , టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఒక్కో వెయ్యి చొప్పున రెండు వేల రూపాయలు మినహాయించి తల్లులకు కేటాయించిన 15 వేల రూపాయల్లో 13 వేలు ఇస్తున్నారని కలెక్టర్ వివరించారు.
పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ కుమార్ ప్రసంగిస్తూ, పేదరికం కారణంగా చదువు మధ్యలోనే నిలిపివేసి తమ తల్లితండ్రులకు తోడుగా కాయకష్టం చేసుకొనే చిన్నారులను బడిబాట తిరిగి పట్టించాలని గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అమ్మఒడి పథకం ఎంతో ఉన్నతంగా ఆలోచించి రూపొందించారన్నారు. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా నేరుగా విద్యార్థినీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ నగదు చేరడం ప్రభుత్వ పారదర్శకతకు అద్దం పడుతుందన్నారు.
తర్వాత కృష్ణాజిల్లా పాఠశాల విద్యాశాఖ రూపొందించిన 202 కోట్ల 35 లక్షల 30 వేల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు మంత్రి జోగి రమేష్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, పామర్రు శాసనసభ్యులు కైలె అనిల్ కుమార్, తదితరుల సమక్షంలో అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి తాహేర్ సుల్తానా, ఆర్టీసీ జోనల్ ఛైర్ పర్సన్ తాతినేని పద్మావతి, జడ్పి సిఇఓ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …