-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి రైల్వే డీఆర్ఎంతో భేటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర అభివృద్ధికి రైల్వే శాఖ సహకరించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి రైల్వే డీఆర్ఎం శివేంద్రమోహన్ తో ఆయన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగరంలో రైల్వే శాఖతో ముడిపడి ఉన్న అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు కీలక అంశాలపై నగర కమిషనర్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. మధురానగర్ ఆర్.యు.బి. దగ్గర మసీదు, రామకృష్ణాపురం అండర్ బ్రిడ్జి వద్ద త్రాగునీరు పైపులైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. అయోధ్యనగర్ – న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. బసవతారక నగర్ నుంచి గుణదల వరకు రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు తొలగించి వర్షపు నీరు పారేలా చూడాలన్నారు. అలాగే హనుమాన్ నగర్ రోడ్డులో ట్రాక్ వెంబడి 400 మీటర్ల సీసీ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు అనుమతులు ఇప్పించవలసిందిగా విన్నవించారు. దీంతో పాటు మధురానగర్ పప్పులమిల్లు వద్ద, గుణదల కార్మిల్ నగర్ దగ్గర, ఓల్డ్ ఆర్ఆర్ పేట-న్యూ ఆర్ఆర్ పేట కలుపు రైల్వే ట్రాకుల వద్ద ఉన్న లెవల్ క్రాస్ లు తొలగించి లిమిటెడ్ అండర్ సబ్ వేలను నిర్మించవలసిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే డీఆర్ఎం సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, సిటీ ప్లానర్ సత్తార్, ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు నారాయణమూర్తి, వి.శ్రీనివాస్, చంద్రశేఖర్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.