-కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మీ
-డాక్టర్ వంశీకృష్ణ సేవలు ప్రశంసనీయం… ఇండియన్ యాక్టర్, సింగర్, స్టార్స్ ఆఫ్ బెంగాల్ కుమారి అంకితా బ్రహ్మ
జంగారెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం మరియు చిరంజీవి హాస్పటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మారథాన్ నేషనల్ డాక్టర్స్ డే-2022 ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. వైద్యులు, యువత, రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై చిరంజీవి హాస్పటల్ నుంచి మసీదు సెంటర్ వరకు నిర్వహించిన మారథాన్‌ను జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మీ గౌరవ అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ.. సమాజంలో వైద్యులే పేషంట్లను కాపాడే ప్రాణదాతలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో మన జంగారెడ్డిగూడెం వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు.
మారథాన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ యాక్టర్, సింగర్, స్టార్స్ ఆఫ్ బెంగాల్ కుమారి అంకితా బ్రహ్మ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ముందుండే రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం వారు చిరంజీవి హాస్పటల్ వారి కలియికలో నిర్వహించిన మారథాన్ వాక్‌కు ముఖ్య అతిథిగా రావడం తన జీవితంలో మరువలేనని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆదరణ, ఆప్యాయత తనను ఆకట్టుకున్నాయన్నారు. త్వరలో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం అధ్యక్ష, కార్యదర్శులు దాకారపు కృష్ణ, ఉడా రాంగోపాల్ మాట్లాడుతూ.. ప్రపంచ వైద్యుల దినోత్సవం రోజు ఈ మారథాన్ కార్యక్రమాన్ని ప్రజల్లో ఆరోగ్య చైతన్యం నింపేందుకు నిర్వహించామన్నారు. ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో డాక్టర్ వంశీకృష్ణను ఘనంగా సత్కరించారు. మారథాన్ కార్యక్రమంలో స్థానిక ప్రజలు నుంచి విశేష స్పందన లభించడంతో పాటు వైద్యుల సేవలను కొనియాడారు. చిరంజీవి హాస్పటల్‌లో ఇటీవల విజయవంతంగా హిప్ రీప్లెస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకొని కోలుకున్న పేషంట్ సుబ్బారెడ్డి, మోకాలు రిప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న వడ్లమూడి తిలక్ మారథాన్‌లో పాల్గొనడం పట్ల డాక్టర్ వంశీకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో సినీనటీ అంకితా బ్రహ్మ, జంగారెడ్డిగూడెం పట్టణ వైద్యులు, చిరంజీవి హాస్పటల్స్ వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.