-ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. శుక్రవారం ఊర్మిళ నగర్లో నిర్వహించిన వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లపైనే చేయడం జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికలకు 3 నెలల ముందు ఓట్ల కోసం పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం మూడేళ్ల పాటు పెంచిన పింఛన్ ను వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డయాలసిస్ పేషంట్లకు అందించిందని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని.. కానీ ఈ ప్రభుత్వంలో 62 లక్షల మందికి పైగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 1,540 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు అధికమన్నారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 16 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25 వేలకు పెంచడం జరిగిందన్నారు. 1వ డివిజన్ కు సంబంధించి గతంలో 979 మాత్రమే ఉన్న పింఛన్లను.. తాము అధికారంలోకి రాగానే 1,483 కి పెంచామన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్ డబ్బును అందజేస్తున్నారన్నారు. ఐటీ రిటర్న్స్, 4 చక్రాల బండి, అధిక కరెంట్ బిల్లుల కారణంగా ఆగిపోయిన పింఛన్లను అర్హతను బట్టి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా పరిశీలించిన తర్వాత అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, కొలకలేటి రమణి, తుంగం ఝాన్సీ, బండి వేణు, ఎల్ఐసి శివ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.