– ఒకేరోజు ఇద్దరికి… ఇద్దరూ వృద్ధులే
– 48 గంటల్లో పూర్తి రికవరీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒకేరోజు డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్‌లో రెండు టావీ ఆపరేషన్లను విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ తమ సంస్ధ ద్వారా సమాజంలోని పేద, అణగారిన వర్గాలకు అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో 100కు పైబడి ‘కీ-హోల్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ’లను విజయవంతంగా నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు అవార్డును అందుకున్నామన్నారు. ఇప్పుడు నూతనంగా ‘టావీ’ (ట్రాన్స్ కాథడర్ అరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్) శస్త్ర చికిత్సా విధానం ద్వారా దేశంలోనే ఎక్కడా జరగని రీతిలో గత శనివారం (ఈనెల 16వ తేదీ) ఒకేరోజు ఇద్దరు సీనియర్ సిటిజన్స్ బెంగళూరుకు చెందిన నాగమ్మ (89), విజయవాడకు చెందిన సరోజ (72) లకు ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ టావీ పద్దతిలో 48 గంటల్లోనే రోగి కోలుకొని డిశ్చారికి సిద్ధమవుతారన్నారు. విప్రో జీఈ ఆధునిక ఎకోమెషిన్తో, సీటీ స్కాన్ ఇంటిగ్రేషన్తో ఈ వాల్వ్ మార్పిడి సర్జరీ జరిగిందన్నారు ఈ సర్జరీకి ‘విప్రో జీఈ వివిడ్ ఈ 95 అల్ట్రా మెషిన్’ను వినియోగించామన్నారు. దీనిని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట వినియోగించింది వరుణ్ కార్డియాక్ సైన్సెస్ అని తెలిపారు. ఈ మెషిన్ ద్వారా ఆపరేషన్ జరిగే సమయంలో ఏ మాత్రం వాల్వ్లు లీకులున్నా టేబులైపైనే పసిగట్టి సరిచేసే అవకాశం ఉంటుందన్నారు. మన రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో, ఆధునిక గుండె వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జిఈ విప్రో, మెరిల్ (గుండె కవాటాల తయారీ కంపెనీ)తో డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఒప్పందాలు చేసుకుందన్నారు. రోగికి ఆర్థికంగా భారాన్ని, శారీరకంగా ఎదురయ్యే అధిక ఇబ్బందులను తప్పించడానికి అవసరమైన శస్త్రచికిత్సలను చేయడానికి ఒప్పందాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అత్యంత ఖరీదైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సర్జరీ కోసం ఇప్పుడిక ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా విజయవాడలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ వంశీ, వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.