Breaking News

రాజకీయంగా ఎదుర్కొనలేక ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-27వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అమలు చేసేందుకు జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం 27 వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. బావాజీపేటలోని లంకా వారి వీధి, రేపల్లె వారి వీధి, దుర్గాపురంలోని పలు కాలనీలలో విస్తృత పర్యటన చేశారు. వార్డు సచివాలయ పరిధిలోని 939 గృహాలలో, 290 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. నవరత్నాలతో 85 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నామని తెలియజేయడం జగనన్న సంక్షేమపాలనకు నిదర్శమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని.. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేసేందుకుగానూ ఒక్కో సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. నిధులను ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు అందజేయగా.. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 96 సచివాలయాలకు సంబంధించి రూ.19.20 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

చిన్నారి పల్లవికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశంసలు
అతిచిన్న వయస్సులో 60 నిమిషాలలో 60 సామాజిక అంశాలపై అనర్గళంగా ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన చిన్నారి కొండా పల్లవి(14)ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. పర్యటనలో భాగంగా చిన్నారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు, దిశ యాప్ సహా పలు సామాజిక అంశాలపై పల్లవి చేసిన ప్రసంగం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. పిన్న వయస్సులోనే ఒక ఇంటర్నేషన్, 4 నేషనల్, 82 స్టేట్ అవార్డులతో పాటు 16 బంగారు పతకాలు, 2 వెండి పథకాలు, 255 అభినందన పత్రాలను సొంతం చేసుకోవడం అరుదైన విషయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, మథర్ థెరిస్సా అవార్డు, లెజండ్ బుక్ ఆఫ్ రికార్డు, బాల ప్రతిభా శిరోమణి, ఆంధ్ర బాలరత్న సహా పలు పురస్కారాలు చిన్నారిని వరించడం వెనుక తల్లిదండ్రులు పాత్ర కీలకమైనదన్నారు. తమ పిల్లల్లో ఉన్న అభిరుచిని, ఆసక్తిని గుర్తించి అందుకు అనుగుణంగా వారిని ప్రోత్సహించినప్పుడే ఇటువంటి గుర్తింపు సాధ్యపడుతుందన్నారు. ఈ చిన్నారి భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాజకీయ దురుద్దేశంతోనే సోము వీర్రాజు విమర్శలు
విజయవాడ నగర అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున సెంట్రల్ నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం విరామం లేకుండా పని చేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. ముంపులో చిక్కుకున్న ప్రతి ఇంటికీ నేరుగా పడవలపై వెళ్లి మరీ సాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఉన్నతాధికారుల నుంచి వాలంటీర్‌ వ్యవస్థ వరకు యంత్రాంగమంతా ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిత్యం లంక గ్రామాలలో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతున్నారన్నారు. అయినప్పటికీ బీజేపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. ముఖ్యంగా సోమువీర్రాజు మత్రిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంపు ప్రాంతాలలో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దేవాలయాల నిధులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించలేదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కనీస అవగాహన లేకుండా.. ఏదో బురద చల్లాలనే దురుద్దేశంతో సోము వీర్రాజు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(యూజిడి) రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు భోగాది మురళి, బొప్పన గాంధీ, వి.బి.ఆచారి, కొరిటి శివ, లంకా కుమార్, సూరిబాబు, శనగశెట్టి హరిబాబు, షేక్ ఖాజా, మందా రాము, చిట్టెమ్మ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *