విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువతలో సృజనాత్మకను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని దుర్గాపురం ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల కళా వేదికపై గురువారం జిల్లా యువజన ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ యువజనోత్సవాలు నిర్వహించడం ద్వారా వివిధ రంగాలలో యువతలో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి కళలను కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సంగీత నృత్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రముఖ గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మన జిల్లావాసి కావడం మనకు గర్వకారణం అన్నారు. కేవలం కూచిపూడి భరతనాట్యంలలోనే కాకుండా కథక్, మణిపురి ఒడిస్సీ వంటి ఆయా రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలలో కూడా ప్రావీణ్యం ఉండాలన్నారు. అదేవిధంగా సంగీతం నృత్యంతో పాటు పర్యావరణం వంటి వినూత్నఅంశాలపై కూడా చర్చా కార్యక్రమాలు నిర్వహించేలా కొత్తదనం తీసుకురావాలన్నారు. జిల్లా యువజనోత్సవాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి దేశస్థాయిలో నిర్వహించే యువజన ఉత్సవాలలో మన జిల్లా కీర్తిని పెంపొందింప చేయాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామి ఇచ్చారు.
రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ యువత మంచిమార్గం వైపు పయనించేలా యువజనోత్సవాలు దోహదపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగీత సాహిత్య నృత్య కళారంగాలను ప్రోత్సహిస్తుందని అన్నారు. నేటి యువతకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదర్శప్రాయులు అని అన్నారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను తన ప్రసంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ యువజనోత్సవాలలో జిల్లా యువత ప్రతిభకనపర్చాలని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ అన్నారు.
అనంతరం అధికారికంగా జిల్లా యువజన ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్యం నృత్యాలు అహుతులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్ అవుతు శ్రీ శైలజరెడ్డి, గౌడ కార్పొరేషన్ చూర్ పర్సన్ మాధు శివరామకృష్ణ, బట్రాజ్ కార్పొరేషన్ చైర్పర్స్‌న్ కూరపాటి గీతాంజలి దేవి, స్థానిక కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి స్టెప్ కృషి కమిషనర్ రామకృష్ణ జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి యు. శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు, కళాశాల విద్యార్థులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …