-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
-భూ రికార్డుల స్వచ్చీకరణ, రీ సర్వే పై.. జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన సీసీఎల్ఏ కమీషనర్ సాయిప్రసాద్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భూ రికార్డుల స్వచ్చీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే పనులను కృష్ణాజిల్లాలో పకడ్బందీగా సాగుతోందని, ఇప్పటివరకు జిల్లాలో 502 గ్రామాలకు గానూ 268 గ్రామాల్లో డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.
గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి రాష్ట్ర భూపరిపాలనా శాఖ కమీషనర్ సాయిప్రసాద్.. సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి..”జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష” పథకం కార్యాచరణ, అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి తన చాంబర్ నుండి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ. కిషోర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విసి ద్వారా సీసీఎల్ఏ కమిషనర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. “జగనన్న శాశ్విత భూ హక్కు – భూ రక్ష” పథకంలో భాగంగా.. ఆయా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రికార్డుల స్వచ్చీకరణ, రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. రీసర్వే కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధానంగా రీసర్వేపై జిల్లా కలెక్టర్లు, జేసీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన తెలిపారు. వివాదాలు లేని భూ రికార్డుల రూపకల్పన కోసమే ఈ రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం.. సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు రీసర్వే, భూ రికార్డుల స్వచ్చీకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగామని.. భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో భూముల స్వచ్చీకరణ ప్రక్రియను ప్రణాళికా బద్దంగా ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వే శాఖ ఏ డి గోపాల్ రాజా, కలెక్టరేట్ తహసిల్దార్ ఎం. హరినాధ్, ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయ సూపర్నడెంట్ రాధికా తదితర అధికారులు పాల్గొన్నారు.