Breaking News

జవాబుదారీతనం పెంచిన సీఎం జగన్

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతలదేవి భాస్కర్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అన్నదాన సమాజం రోడ్డు, కరెంట్ ఆఫీస్ రోడ్డు, సంజీవయ్య కాలనీ, కాల్వగట్టు వీధులలో విస్తృతంగా పర్యటించి 323 ఇళ్లను సందర్శించారు. మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఒరవడిని స్థానికులకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్ లెట్లను లబ్ధిదారులకు అందించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ.. వాటిని పరిష్కరిస్తూ ముందుకెళుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక దోబీఘాట్ ను సందర్శించారు. ఘాట్లో మైనర్ మరమ్మతులు నిర్వహించి.. ఫెన్సింగ్ ఏర్పాటు చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి తెలిపారు. కమ్యూనిటీ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వీఎంసీ సిబ్బందికి సూచించారు. అలాగే రేవు వెంబడి పేరుకున్న గుర్రపుడెక్కను తొలగించాలని ఆదేశించారు.

ప్రతి శుక్రవారం డ్రై డే తప్పనిసరి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని.. తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపైన, దోమల నివారణ మార్గాలపై స్థానికులకు విస్తృత అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎక్కువ రోజులు ఇళ్లల్లో నీటిని నిల్వ ఉంచకూడదని ఈ సందర్భంగా సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని.. వ్యాధులు దరిచేరవని తెలిపారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని.. కనుక గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులు, కుండీలలో కనీసం మూడు రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకి ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి పవన్
దేశంలోనే బలమైన నాయకుడిగా ఎదిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా.. రాష్ట్రంలో ఏఒక్క రాజకీయ పార్టీకి లేదని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. కనుకనే సిద్ధాంతాలు, ప్రజల బాగోగులను పక్కనపెట్టి.. వైఎస్సార్ సీపీని ఎలాగైన ఢీ కొనాలనే సింగిల్ అజెండాతో పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చంద్రబాబుకి ఊడిగం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే 175 స్థానాలలో వైఎస్సార్ సీపీపై ఒంటరిగా పోటీ చేయాలని.. లేకుంటే జనసేనను ఒక రాజకీయ పార్టీగా కూడా ప్రజలు భావించరని తెలిపారు. అంతేగానీ మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జన సైనికులను టీడీపీకి తాకట్టు పెడుతున్న నీకు.. ముఖ్యమంత్రి గూర్చి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయినా.. ఉత్తర కుమార ప్రగల్భాలను పవన్ నేటికీ మానుకోలేదని వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి గూర్చి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే ముందు స్థాయి తెలుసుకుంటే మంచిదని సూచించారు. అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికై పాటుబడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. యువశక్తి సభలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులపై చేసిన దిగజారుడు విమర్శలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం క్షమించబోరని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సిడిఓ జగదీశ్వరి, నాయకులు బంకా భాస్కర్, బంకా బాబి, రఫీ, అబ్దుల్ నజీర్, నాగేశ్వరరెడ్డి, కోలంటి రవి, చినబాబు, భోగాది మురళి, బంకా వెంకటేష్, ఆలీ, యక్కల మారుతి, విద్యావతి, వి.బి.ఆచారి, లక్ష్మణ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *