-ముఖ్యమంత్రి సీఈవో డాక్టర్ సమీర్ శర్మ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ప్రజాసేవలో భాగస్వామ్యం కావాలని మాజీ సిఎస్, ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ సమీర్ శర్మ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం 9 వ డివిజన్ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను క్షుణంగా పరిశీలించారు. ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు సచివాలయంలో అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల తీరు ఆయన పరిశీలించారు. సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించాలని వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఆరిఫ్ కు ఆయన వివరించారు. 9 వ సచివాలయం పరిధిలో ఉన్న పలువురు గర్భిణీ మహిళలు , బాలింతలుతో మాట్లాడారు. వారికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఏ విధంగా ఉందో ఏఎన్ఎం బి. రంగమ్మ ను అడిగి తెలుసుకున్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు వారిని ప్రతిరోజు శ్రద్ధగా పర్యవేక్షించాలని సూచించారు. వారికి అవసరమైన మందులు, సప్లిమెంట్స్ సక్రమంగా అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. బడి ఈడు పిల్లలకు పౌష్టికాహారం ఏ విధంగా అందుతుందో అనే విషయంపై వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ రఫత్ సుల్తానాను ప్రశ్నించారు. అలాగే మానసికంగా పరిపక్వత చెందని 14 ఏళ్ల వయసున్న తుమ్మ వైష్ణవి అనే బాలిక ఆరోగ్యం పై వాకబు చేశారు, అలాగే 17 సంవత్సరాల గద్దల హర్షవర్ధన్ అనే యువకునితో డాక్టర్ సమీర్ శర్మ కాసేపు మాట్లాడారు. వారి ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడడం రాని వైష్ణవికి స్పీచ్ థెరపీ నేర్పించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ జి గీతా బాయి కు ఆయన ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను అభినందించిన ప్రభుత్వ సీఈవో డాక్టర్ సమీర్ శర్మ
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కృష్ణాజిల్లా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించి పలు ప్రాంతాల్లో ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తూ,అందుకై కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కార్యనిర్వాహణ తీరును ముఖ్యమంత్రి సీఈఓ డాక్టర్ సమీర్ శర్మ ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణాజిల్లాలో మాదిరిగా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో సైతం ఇదే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అమలు చేసే విధంగా తాను రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరికీ విద్య ,బడి వయసు పిల్లలందరూ పాఠశాల కు వచ్చేలా సమగ్ర కార్యాచరణ,పురుషులతో సమానంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడంతో పాటు ఆయా కుటుంబాలను పేదరికానికి దూరం చేసేందుకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను అమలు చేయడం,ఐదేళ్ల లోపు పిల్లలు ఉండే బరువు,మంచి ఆరోగ్యం,సంతోషకరమైన మానసిక స్థితి నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్ర వాతావరణం,విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతుల కల్పన జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు,పారిశ్రామిక పురోగతి,అసమానతల తొలగింపు,పట్టణీకరణ,ప్రజలలో కొనుగోలు శక్తి, ఉత్పత్తి అవకాశాలు పర్యావరణ పరిరక్షణ ,మత్స్య సంపద,పర్యావరణ పరిరక్షణ. భూపరిరక్షణ శాంతి. న్యాయం తదితర స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు కృష్ణాజిల్లాలో అమలవడం పట్ల డాక్టర్ సమీర్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, 9 వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ జానకిరామ్, జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, మచిలీపట్నం తహసిల్దార్ సునీల్ బాబు, సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, ఐసిడిఎస్ పిడి సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు