విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ పార్టీగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తాడివాక రమేష్ నాయుడు, గోదావరి జిల్లాల నుండి గిద్ద శ్రీనివాస్ నాయుడు, జంగారెడ్డిగూడెం కు చెందిన వి కే నెహ్రూ లు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన ఛలో ఖమ్మం సభ విజయవంతమైందని తెలిపారు. ఈ సభకు బిఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి భారీగా బిఆర్ఎస్ అభిమానులు హాజరయ్యారని చెప్పారు. దక్షిణ భారత నుండి వచ్చిన ఏకైక జాతీయ పార్టీ గా ఆవిర్భవిస్తుందన్నారు. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలలో బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలియజేశారు. రాజకీయం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం కాదని హితువు పలికారు. ఏపీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కేసీఆర్, రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దేశానికి, రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. దానా గౌడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి అనుకూలం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి బలోపేతం చేయడానికి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చినట్లయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అలానే ఆంధ్ర ప్రదేశ్ విభజన హామీలు నెరవేరుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి భారతదేశం మొత్తం జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంశీ, రాష్ట్రం లోని పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News