-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజీవ్ గాంధీ పార్కుకు విచ్చేసే సందర్శకులకు ఆహ్లాదంతో పాటు వినోదం కూడా అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహకులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలోని రాజీవ్ గాంధీ పార్కును సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పార్కులో బయో డైవర్సిటి మ్యూజియం. బోన్సాయ్ గార్డెన్, ఫౌంటైన్, స్కేటింగ్ రింగ్, అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. అయితే మొక్కల సంరక్షణతో పాటు వాటిని సందరంగా తీర్చిదిద్దడంలో నిర్వహణపై మరింత శ్రద్ద పెట్టావలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న మొక్కలకు అదనంగా ఉసిరి, మారేడు, రాయల్ ఫామ్స్, పారిజాతం, సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వంటి మొక్కలను పెంచాలన్నారు. వివిధ రకాల జంతువులు, పక్షులకు సంబంధించిన అందమైన ఫోటోలను చెట్ల మధ్యలో అలంకరించాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావారణంతో పాటు చిన్నారులకు పెద్దలకు వినోదాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పార్కులో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన వేదికను ఏర్పాటు చేసి నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు చిరు పారితోషకం అందించి సంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుని సందర్శకులకు వినోదాన్ని కల్పించాలన్నారు. సందర్శకులు తినుబండారాలు, సీతలపానీయాలను పార్కు వెలుపల అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని, పార్కులోపల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిని రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి తినుబండారాలను విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సందర్శకులకు స్వచ్చమైన త్రాగునీరు అందించాలని, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్కు లోపల వెలుపల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సందర్శనలో కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్, పార్కు ఇఇ ఎఎస్‌ఎన్ ప్రసాద్, ఎఇలు, డిఇలు ఉన్నారు.