రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శనివారం ఉదయం రెడ్ క్రాస్ విభాగం జిల్లా సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వై. మధుసూధన్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరమునకు చెందిన కార్యాచరణ పై కలెక్టర్ కి నివేదిక అందజేశారు. అనంతరం కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి అయిందని, జిల్లాలో రెడ్ క్రాస్ యూనిట్ ద్వారా మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిచాల్సిన అవస్యకత కలెక్టర్ గుర్తు చేశారు. విద్యార్థులు, స్వయం ఉపాధి రంగంలో, ఉపాధి హామీ కార్మికుల, ఉద్యోగాలు చేస్తున్న అర్హులను గుర్తించి వారికి మేకనైజ్డ్ మోటార్ సైకిళ్ళు దశల వారీగా పంపిణీ చేయాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు (లింబ్స్) పంపిణీ చేయడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ ద్వారా జిల్లాలో వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి అమలు చేయాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా శామ్ – మామ్ పిల్లల కోసం జిల్లాలో బంగారు కొండ అనే కార్యక్రమాన్ని రూపు దిద్దుతున్నామని మాధవీలత తెలిపారు. అదే తరహాలో గర్భిణీ స్త్రీల కోసం రెడ్ క్రాస్ ద్వారా రక్త హీనత ఎదుర్కునే క్రమంలో అడుగులు వేయ్యాల్సి ఉంటుందని, ఆ దిశలో దాతల సహకారం ముఖ్యమని పేర్కొన్నారు. నేరుగా వ్యక్తిగత సంరక్షణ ద్రాతృత్వం లేదా నగదు రూపంలో దాతలు సహకారం తీసుకోవడం మంచిదన్నారు. ఆసక్తి గల వారిని భాగస్వామ్యం చెయ్యాలని పేర్కొన్నారు. టీబీ పేషంట్స్ దత్తత, సామాజిక చైతన్యం పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చెయ్యడం కోసం తగిన ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు. ఇప్పటికే అమలు జరుగుతున్న కార్యక్రమలతో కలిసి నిర్దుష్టమైన ప్రణాళిక తో కార్యాచరణ ముఖ్యమఅని పేర్కొన్నారు. ఇకపై నెలలో రెండు సార్లు రెడ్ క్రాస్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
యువత ను రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చెయ్యడం తో, యోగ వంటి కార్యక్రమాలను , నైపుణ్యాభివృద్ధి తరగతుల ఆలోచన చేస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వై. మధుసూధన్ రెడ్డి తెలియచేశారు. ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రకృతి విపత్తు నిర్వహణ, అగ్ని ప్రమాదాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వై. మధుసూదన్ రెడ్డి తో పాటు ఏ నరేష్ కుమార్, పి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News