-ఏపీయూడబ్ల్యూజే ఆఫిస్ బేరర్ల సమావేశం పిలుపు
-అర్హులందరికీ అక్రెడిటేషన్ దక్కేవరకూ అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు దక్కేవరకూ పోరాటం కొనసాగించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పిలుపు ఇచ్చింది. శనివారం జూమ్ లో జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్లు , హైదరాబాద్ లో సీబీఐ కోర్టువద్ద విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై జరిగిన దాడులు, విజయనగరం జర్నలిస్టులపై సిఐడి పెట్టిన కేసు వంటి అంశాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ఆయా సమస్యపై యూనియన్ చేసిన కృషిని ,అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ,ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ సమావేశానికి వివరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ తో , అధికారులతో యూనియన్ రాష్ట్రనాయకత్వం రెండుదఫాలు భేటీ అయిన సందర్భంలో కమిషనర్ ఇచ్చిన హామీలపై సమావేశం చర్చించింది. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ అందేవరకూ రాష్ట్రకమిటీ సభ్యులు, జిల్లాశాఖల బాధ్యులు ప్రత్యేకదృష్టి పెట్టాలని ,సమస్య పరిష్కారం అయ్యేవరకూ అప్రమత్తంగా ఉండాలని , కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్నవీ లేనిదీ గమనించాలని సమావేశం పిలుపు ఇచ్చింది. జిల్లాల్లో ఏ సమస్య తలెత్తినా వెంటనే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం కోరింది. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్లు అందేవరకూ పోరాటం వివిధ రూపాలలో కొనసాగించ డానికి సిద్ధంగా ఉండాలని సమావేశం పిలుపు ఇచ్చింది. పాత్రికేయులపై దాడులు పెరిగిపోవడంతో సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులపై ఎంపి అనుచరుల దాడిని నిరసిస్తూ , నిందితులను వెంటనే అరెస్టు చేయాలని , జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేకచట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మే 22వ తేదీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనదినం పాటించాలని సమావేశం పిలుపు ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు , ఎస్పీలకు వినతిపత్రాలు అందచేయాలని జిల్లా శాఖలను కోరింది. వాట్సాప్ లో వచ్చిన ఒక జీవో అనువాదం గురించి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శివప్రసాదరావుతో పాటు, విజయనగరం లోని శ్రీను అనే జర్నలిస్టు పై ఏపీ సీఐడి విభాగం కేసుపెట్టడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. సమావేశంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటిఆంజనేయులు, ఐజేయూ జాతీయకార్యదర్శి డి.సోమసుందర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.ప్రసాద్, ఏ.పి. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రఉపాధ్యక్షులు కంచర్ల జయరాజ్, రాష్ట్ర కార్యదర్శులు ఏ.జయప్రకాష్ , పి.ఎస్.ఎస్.వి. ప్రసాదరావు , పి.రామసుబ్బారెడ్డి , రాష్ట్ర కోశాధికారి ఏ.వి.శ్రీనివాసరావు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News