-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజలాల పున:పంపిణీకై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్, కరువు సమస్యలపై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదిలలో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. విజయవాడ దాసరి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో కరవు ప్రాంతాలలో పంటల పరిశీలన చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో 80 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, 24 లక్షల ఎకరాల్లో కూడా పంటలు వేయలేదన్నారు. ఆయకట్టు రైతులు కూడా పంటలు వేయలేక పోయారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టపర్తి పర్యటనలో కరవు గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. వ్యవసాయ శాఖా మంత్రి ఏమైయ్యారో తెలియడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా కరువు పరిస్థితులను పట్టించుకోకుండా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమంలో ఉండిపోతున్నారని ఆరోపించారు. మంత్రివర్గ సమావేశం పెట్టి కరవు గురించి చర్చించలేదన్నారు. ఇలాంటి మంత్రివర్గం అవసరమా? అనే సందేహం వెలిబుచ్చారు. ప్రజల్ని, రైతుల్ని, వ్యవసాయాన్ని పట్టించుకోని జగన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నారు. తక్షణమే పంట నష్టాలను అంచనా వేయించి, కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలసలను ఆపాలని కోరారు. చిక్‌బళ్లాపూర్ రోడ్డు ప్రమాదంలో 13 మంది వలస కూలీలు చనిపోయారని, వలసలను నివారించడంలో వైసిసి ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీ పేరుతో ఏపీకి మరో ద్రోహం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటప్పుడు కేంద్రం కొత్త కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా వివాదస్పదమైన ప్రాజెక్టు అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.5,300 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కృష్ణాజలాల పున:పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఢల్లీిలో ఉండగానే మోడీ ప్రభుత్వం కృష్ణాజలాల పున:పంపిణీకై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి చేతగానితనం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందన్నారు. కరువు, కృష్ణా జలాల అంశాలపై ఈ నెల 20, 21 తేదీల్లో విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల నిరసన దీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ దీక్షలో రాష్ట్ర, జిల్లాల పార్టీ నాయకత్వం పాల్గొంటుందన్నారు. ఈ దీక్షను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిరసన దీక్ష వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.