Breaking News

మీ భవిష్యత్తుకు ”అమ్మ” తోడు

-“అమ్మ” ప్రోత్సాహం ఉన్నత శిఖరాలకు బాసట…
-“అమ్మ” ఆప్యాయత, అనురాగం, ప్రేమ స్ఫూర్తిదాయకం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ల సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భావి భారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించేందుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందిస్తున్న ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన అన్నారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మ కళ్యాణమండపంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో రవాణా రంగానికి ఎంతో కీలకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిన విజయవాడ నగరంలో “అమ్మ” విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదన్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత విద్య అందుకునేందుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. పేద విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుటుందన్నారు. దాతల భాగస్వామ్యం తోడైతే విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయగలుగుతామన్నారు. విద్యలో ప్రతిభ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల చదువులను మధ్యలోనే అపేస్తున్న కారణంగా ఉన్నత చదువులు చదవాలనే కోరిక నెరవేర్చుకోలేక పేదలుగానే మిగిలిపోతున్నారని అన్నారు. సహజంగా ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు పేద కుటుంబాలకు చెందిన వారై ఉంటారన్నారు. వారి పిల్లలకు మంచి విద్యా బోధన అందించేందుకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుంటుంబాల వారిని స్వంత కుటుంబ సభ్యుల్లా ఆదరించడం అభినందనీయమన్నారు. గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా విద్యార్థులకు ఉపకారవేతనాలను అందించడం మరి కొంతమంది దాతలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది 418 మంది విద్యార్థులకు రూ. 16 లక్షల రూపాయల ఉపకార వేతనాలు, రూ. 2 లక్షలతో నోట్ పుస్తకాలను పంపిణీ చేయడంతోపాటు రెండు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందించడం గొప్ప విషయమన్నారు. మొగల్రాజుపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ పాఠశాలలను దత్తత తీసుకుని ముగ్గురు కంప్యూటర్ టీచర్లకు జీతాలను చెల్లించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ద్వారా నగరంలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందడం కోసం విద్యార్థులు ఉత్సాహపడే స్థాయికి పాఠశాల అభివృద్ధి చెందాలని కోరారు. దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో రాణించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. పిల్లలు ఆసక్తిగా విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆటోనగర్, గవర్నపేటలలో ఆటోమొబైల్ షాపులలో పనిచేసే సిబ్బంది, కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 1999 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని, నోట్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. కానూరులో 60 లక్షల రూపాయలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించి 40 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భాధితులకు వివిధ రూపాల్లో సహాయం అందించామని వివరించారు. కరోనా సమయంలో సైతం రోగులకు ప్రతి రోజు ఉచితంగా భోజన ఏర్పాట్లు కల్పించామన్నారు. బోయపాటి శివరామకృష్ణయ్య పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి ఏడాది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎన్ఆర్ఐ వైద్య కళాశాల డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ కె.వి.ఎస్. కుమార్ చౌదరి, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల డీన్, నేత్ర విభాగం హెచ్.ఓ.డి. ప్రొఫెసర్ లక్ష్మీ చౌదరి వ్యాధి గ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఔషధాలను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు గారపాటి సతీష్ బాబు దోనేపూడి దుర్గాప్రసాద్, యార్లగడ్డ సుబ్బారావు, అన్నే శ్రీనివాసరావు, బొబ్బా నారాయణ రావు, మిరియాల వేంకటేశ్వర రావులతో సహా అసోసియేషన్ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *