Breaking News

ముఖ్యమంత్రులకు వరం.. రైతులకు శాపం!

-20 ఏళ్లలో 12% నిర్వాసితులకు మాత్రమే ప్యాకేజి
-పదేళ్లుగా పోలవరం ప్రాజెక్టులో దోపిడీ..
-సాంకేతిక అంశాలు పరిష్కరించకుండా నిర్మాణం ఎలా..?
-ప్రాజెక్టుని పరిశీలించిన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టులో గడిచిన కొన్నేళ్లుగా దోపిడీ జరగడం తప్ప.. పనుల్లో ప్రగతి కనిపించడం లేదని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.. కొందరు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్ వే, ఛానెల్, కాఫర్ డ్యాములు, డయా ఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణ పనులను దగ్గరుండి చాలాసేపు పరిశీలించారు.. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. సాంకేతికంగా చేయాల్సిన పనులు ముందు చేయకుండా.. కమీషన్లు, కాసుల కోసం అత్యవసరంగా కొన్ని పనులు చేసేశారని.. ఆ కారణంగా గత పదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారిందన్నారు. కాఫర్ డ్యాములు పూర్తిగా నిర్మించకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం.. అది కూడా నాణ్యత లేకపోవడం, నీటిని మళ్లించడంలో సాంకేతిక పద్ధతులు పాటించకపోవడం వంటి తప్పుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు కదులుతుందని పేర్కొన్నారు.. కేంద్రం ఇచ్చిన సహకారాన్ని వాడుకోకుండా, రెండు ప్రభుత్వాలు కేవలం కాసుల కోసం వారికి నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చుకుని.. అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.. కేవలం ఇది పాలకులకు మాత్రమే వరంగా మారిందని.. రైతులకు, నిర్వాసితులకు శాపంగా మారిందని ఆయన తెలిపారు..!

రెండు దశాబ్దాలుగా నిర్వాసితుల సమస్యలు..!
ఏదైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తుంటే ముందుగా నిర్వాసితులను పునరావాసాలకు తరలించాలి, ఆ తర్వాత ముంపు గ్రామాలకు ఖాళీ చేయించాలి, ఆపై అక్కడ రిజర్వాయర్ నిర్మాణం, ప్రాజెక్టు, కాలువల నిర్మాణం అన్ని పనులు సమాంతరంగా జరగాలి.. కానీ ఈ పోలవరం ప్రాజెక్టులో మాత్రం డబ్బులు త్వరగా మిగిలేలా కాలువ తవ్వకాల పనులు మొదట చేసేసి.. అలాగే అన్నిటా మిగుల్చుకునే పన్నాగమే పన్నారన్నారు. మొత్తం 1.06 లక్షల మందికి పునరావాసం కల్పించాల్సి ఉండగా.., గత 20 ఏళ్లలో కేవలం 12% మందికి మాత్రమే పునరావాసం కల్పించారని, ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం ప్రాజెక్టు పూర్తయ్యే సరికి 100% అందరికీ పునరావాసం కల్పించాలని.. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.. పునరావాసం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేసారు..? కేంద్రాన్ని తప్పుదోవ పట్టించి పనులను అడ్డగోలుగా దోచుకోవడానికి చేయడం న్యాయమా అంటూ నిలదీసారు. “ఇన్నాళ్లు జరిగినది పక్కన పెట్టి.. రానున్న రెండేళ్లలో ప్రాజెక్టుని పూర్తి చేసి, రైతులకు నీళ్లు అందించేలా ప్రభుత్వం పని చేయాలనీ.. లేని పక్షంలో బీసీ వై పార్టీ తరపున ప్రాజెక్టు దగ్గర ఉద్యమం ఉదృతంగా చేస్తామని.. రైతులకు పూర్తిగా అండగా నిలుస్తామని” హెచ్చరించారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *