Breaking News

విజయవాడకు 46 మర పడవలు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రింబవళ్లు నిద్ర లేకుండా మేల్కొని మచిలీపట్నం నుండి 46 మర పడవలను విజయవాడకు పంపించారు. ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద గల తాళ్లపాలెం గ్రామం వైఎస్ఆర్ కాలనీ చేరుకుని అక్కడి మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వరద నీటితో జలమయమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడికి వీలైనన్ని మర పడవలను పంపించి అక్కడి ప్రజలను ఆదుకోవలసి ఉందన్నారు. మత్స్యకారులందరూ సహకరించి మరపడవలు తీసుకుని విజయవాడకు వెళ్ళుటకు సహకరించాలని పడవల కోసం ప్రత్యేకంగా ట్రక్కులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో మత్స్యకారులు భాగస్వాములై ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. అందులకు గ్రామ పెద్ద శ్రీధర్, పలువురు మత్యకారులు పడవలు ఏమైనా దెబ్బతింటే తమ జీవనాధారం కోల్పోతామని చెప్పడంతో వాటి స్థానంలో కొత్త పడవలు ఇప్పిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో మత్యకారులందరూ తమ పడవలను విజయవాడ పంపేందుకు అంగీకారం తెలిపారు. ఆ ప్రకారం ప్రస్తుతం వారి వద్ద ఉన్న 89 మర పడవలను అందజేసేందుకు మత్స్యకారులు ముందుకు వచ్చారు. ఆ మర పడవలను విజయవాడకు పంపేందుకు అవసరమైన ట్రక్కులను వెంటనే సమకూర్చాలని రవాణాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం 13 ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయని, మరో 21 ట్రక్కులు గుడివాడ నుంచి తెప్పిస్తామని ఎంవీఐ శ్రీనివాసరావు కలెక్టర్ కు వివరించారు. ట్రక్కులలోకి మర పడవలను ఎక్కించేందుకు క్రేన్లను కూడా వెంటనే తెప్పించాలని కలెక్టర్ ఎంవీఐని ఆదేశించగా ప్రస్తుతం 3 క్రేన్లు సిద్ధంగా ఉన్నాయని వాటిని తెప్పిస్తామని ఎం వి ఐ చెప్పారు. ఇంకా క్రేన్లను తెప్పించాలని కలెక్టర్ ఎం వి ఐ కి సూచించారు. ఆ ప్రకారం అందుబాటులో వున్న 3 క్రేన్లు తెప్పించి మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద పాకల సముద్రతీరంలో ఆగి ఉన్న మరపడవలను జిల్లా కలెక్టర్ దగ్గరుండి క్రేన్లతో 12 మర పడవలను పైకి ఎత్తించి ట్రక్కులలో ఉంచే ఏర్పాటు చేశారు. తదనంతరం మరో 3 క్రేన్లు కూడా తెప్పించి అన్ని క్రెన్ల ద్వారా మరో 20 మర పడవలను కూడా పైకి ఎత్తించి ట్రక్కులలో ఉంచి విజయవాడకు పంపించే ఏర్పాటు చేశారు.

అంతకుముందు క్యాంపు బెల్ పేట, గిలకలదిండి నుండి 14 మర పడవలను ట్రక్కులలోకి క్రేన్ ల ద్వారా ఎక్కించి విజయవాడకు పంపించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా జిల్లాలో ఉయ్యూరుకు 12, గన్నవరంకు 3, పెనమలూరుకు 2, తొట్లవల్లూరుకు 8 కలిపి మొత్తం 25 పడవలను జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి అక్కడ సహాయక చర్యలు, ముంపు ప్రాంత ప్రజలను తరలించేందుకు పంపించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్, డి.ఎస్.పి సుభాని, ఎఫ్ డి ఓ ప్రతిభ, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు నరసింహ, పోలీస్ సిబ్బంది, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత…

-గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *