గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, ప్రస్తుత వర్షాల వలన నీటిని అధిక ప్రాధాన్యత క్రమంలో ఫిల్టర్ చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్ లోని రిజర్వాయర్లను ఈఈ కోటేశ్వరరావు కలిసి పైకి వెళ్లి పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాజ్ సెంటర్ రిజర్వాయర్ ని పరిశీలించి, ఎన్ని లీటర్ల కెపాసిటి, ఏ ప్రాంతాలకు సరఫరా, సరఫరా సమయాలు, రిజర్వాయర్ క్లీనింగ్ తదితర వివరాలను ఈఈని అడిగి తెలుసుకొని మాట్లాడుతూ నగరంలోని ప్రతి రిజర్వాయర్ నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, శుభ్రం చేసిన తేదీని ప్రత్యేకంగా బోర్డ్ మీద నోట్ చేయాలన్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో వరద వస్తున్నందున నగర ప్రజలకు అందించే నీటిని మరింతగా ఫిల్టర్ చేయాలన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ తో పాటు ప్రతి రిజర్వాయర్ దగ్గర త్రాగునీటిని సరఫరాకి ముందు క్లోరిన్ శ్యాంపిల్స్ చెక్ చేయాలన్నారు. రిజర్వాయర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాలకు, గాలులకు విద్యుత్ అంతరాయం వచ్చినా త్రాగునీటి సరఫరాకి ఆటంకం లేకుండా ముందస్తుగా జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా సమయంలోనే ఎమినిటి కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో శ్యాంపిల్స్ తీయాలని, ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా, పైప్ లైన్ లీకులు గుర్తిస్తే వెంటనే ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి,పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
Prajavartha Online Telugu News