గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు గుంటూరు నగరపాలక సంస్థ తరుపున అందించే ఆహార పదార్ధాలను అత్యంత జాగ్రత్తగా, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి అందించేలా పర్యవేక్షణ అధికారులు శ్రద్ధ చూపాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్ లోని రిజర్వాయర్ నుండి విజయవాడకు పంపుతున్న 1 లక్ష ఆహార, అల్పాహార పదార్ధాల ప్యాకెట్స్, వాహనాలను కమిషనర్ పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాల వలన విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ నుండి మంగళవారం టమాటా బాత్, వెజ్ బిర్యాని, సాంబార్ అన్నం, పెరుగన్నం, పాలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్ ప్యాకేట్స్ ని పూటకి 1 లక్ష వంతున అందిస్తున్నామన్నారు. ఆహార పదార్ధాల తయారీ, సరఫరా చేసే క్యాటరింగ్ ఏజన్సీలు పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన సరుకులు వినియోగించాలన్నారు. వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అందించే ఆహార పదార్ధాలలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆహార పదార్ధాల సరఫరా, పంపిణీకి కేటాయించబడిన పర్యవేక్షణ అధికారులు క్యాటరింగ్ ఏజన్సీలతో సమన్వయం చేసుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహార సరఫరా, పంపిణీకి విధులు కేటాయించబడిన కార్యదర్శులు, సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండేలా విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, ఏఈలు సునీల్ కుమార్, పవన్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News