గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వాయు కాలుష్య, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లు, డ్రైన్లపై ఆక్రమణల తొలగింపుకు జిఎంసితో పాటుగా ట్రాఫిక్ పోలీస్, డిటిసి, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, ఆర్టీసి, ఆర్ & బి శాఖల సమన్వయంతో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్నిస్వచ్చత హి సేవా లో భాగంగా స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు విరివిగా ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నామన్నారు. నగర సుందరీకరణ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జిఎంసితోపాటు ఇతర శాఖలు కూడా కలిసి రావాలన్నారు. నగరంలో ప్రధానంగా వాతావరణ కాలుష్యానికి కారణమైన లైఫ్ టైం ముగిసిన వాహనాలను రవాణా శాఖ అధికారులు కట్టడి చేయాలని, జిఎంసి చెందిన అటువంటి వాహనాలను నిబందనల మేరకు స్క్రాప్ కి పంపాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖతో పాటు ఆర్టీసీ అధికారులు కూడా సహకరించాలని, అందుకు తగిన తోడ్పాటుని జిఎంసి నుండి అందిస్తామన్నారు. నగరంలోని ప్రధాన రోడ్ల వెంబడి ఫుట్ పాత్ లు, రోడ్లను ఆక్రమణలు చేసుకొని వ్యాపారాలు చేస్తూ ప్రజలకు, ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నారని, అటువంటి ఆక్రమణదారులకు విద్యుత్ సౌకర్యం తొలిగించాలని, నూతనంగా ఎక్కడా కనెక్షన్ ఇవ్వవద్దని సిపిడిసిఎల్ అధికారులకు స్పష్టం చేశారు. త్వరలో నగరంలో వెండింగ్ జోన్లు, ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్ల వెంబడి అనారోగ్యకర వాతావరణంలో ఆహార పదార్ధాలు విక్రయిస్తున్న వారి పై రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని, అందుకు జిఎంసి ప్రజారోగ్య అధికారులు సహకరిస్తారని ఫుడ్ కంట్రోల్ విభాగ అధికారులకు తెలిపారు. నగరంలోని ఆర్&బి రోడ్ల పై ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని, అలాగే నగరపాలక సంస్థ పరిదిలోని ఆర్&బి రోడ్లను జిఎంసి బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన లేఖలు అందిస్తామని తెలిపారు.
సమావేశంలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ట్రాఫిక్ డిఎస్పీ రమేష్, ఆర్టీఓ సత్యనారాయణ ప్రసాద్, సిపిడిసిఎల్ ఈఈ శ్రీనివాసబాబు, ఆర్&బి డిప్యూటీ ఎస్.ఈ. నాగిరెడ్డి, ఆర్టీసి ఆర్ఎం రవి కాంత్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణ చంద్రరావు, ఎంఈఓ నాగేంద్రమ్మ, జిఎంసి మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …