-మంత్రి కొల్లు రవీంద్ర
పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన, నేటి పత్రిక ప్రజావార్త :
ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు మంత్రి వివరించి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన గ్రామాలలోని పలు సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ కూటమి పార్టీకి 175 స్థానాలకు గానూ 164 ఎంఎల్ఏ సీట్లు ఇచ్చి గొప్ప విజయాన్ని అందించారని, అందుకు ప్రజల అంచనాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో అమలు చేసిన పథకాలు వివరించడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, 16,500 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, నైపుణ్యాభివృద్ధి సెంటర్ల ఏర్పాటు వంటి 5 ప్రధాన అంశాలపై తొలి సంతకాలు చేశారని మంత్రి గుర్తు చేశారు.
సూపర్ సిక్స్ హామీలు అమలులో భాగంగా వచ్చే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నామన్నారు. తల్లికి వందనం పథకం అందించడంపై ఇప్పటికే సర్వే జరుగుతున్నట్లు తెలుపుతూ సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళుతున్నామన్నారు.
పల్లె తుమ్మలపాలెం సమీపంలోని గుండేరు, నడిమేరు ఉప్పుటేరులపై రూ.14 కోట్లతో వంతెనలను నిర్మించేందుకు టెండరు ప్రక్రియలు పూర్తి కానున్నాయని తెలుపుతూ త్వరలో నిర్మాణాలను చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
పల్లె తుమ్మలపాలెం, పోలాటితిప్ప, కోన గ్రామాలతో పాటు పరిసర గ్రామాలకు త్రాగునీటి సమస్యను తీర్చేందుకు యాదర సమీపంలో 70 ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవ్వించి అక్కడ నుండి అన్ని గ్రామాలకు జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
పల్లె తుమ్మలపాలెం గ్రామంలో కాలువ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా ఫిష్ ల్యాండ్, మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను త్వరలోనే చేపడతామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించినట్లు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.4 లక్షల అందిస్తామన్నారు.
త్వరలో కృష్ణా యూనివర్సిటీ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం, అక్కడ నుండి పది మీటర్ల వెడల్పుతో అన్ని గ్రామాలను కలుపుతూ రహదారులకు మరమ్మతులు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, మచిలీపట్నం తహసిల్దార్ మధుసూదనరావు, ఎస్ఎన్ గొల్లపాలెం ఎంపీటీసీ కల్లూరి సురేష్, గ్రామ సర్పంచ్ లు మోకా నాగరాజు, ఒడుగు నాగరాజు, మంగా రాజు, స్థానిక నాయకులు శ్రీనివాసరావు, వీరంకి మునేశ్వరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News