Breaking News

ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి జి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ యం. వాణిలతో కలిసి మీకోసం- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఇటీవల కాలంలో భారీ వర్షాలు వరదల కారణంగా మీకోసం నిర్వహించకపోవడంతో ఒకసారిగా పెద్ద సంఖ్యలో అనగా మొత్తం 160 అర్జీలు అందాయి.వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు ఈ ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు సలీం బేగ్, జిల్లా కార్యదర్శి ఎస్ సమరం జిల్లా కలెక్టర్కు అర్జీ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వసతి దీవెన, విద్యార్థి దీవెన 3 వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ వసతి గృహాల్లో మెస్చార్జీలు పెంచాలని, పీజీ విద్యార్థులకు 77 జీవోను రద్దుచేసి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని డిగ్రీ మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కాకుండా కాపాడేందుకు జీవో నంబరు 107, 108 లను రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థినులకు రక్షణ కల్పించాలని అందులో వారు పేర్కొన్నారు.
అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన విద్యార్థులకు ఫీజులు రద్దు చేయాలని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని అందులో కోరారు.

ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన గోపరాజు అచ్యుతానంద మాట్లాడుతూ ఏలూరు కాల్వ కింద సాగుకాబడి మాగాణి పల్లం భూమి తనకు 6.42 ఎకరాలు కలదని, ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే అడంగల్ నందు తన పేరు తప్పుగా నమోదు చేసి ఉన్నారని, పేరు మార్చాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నానని, తన పేరును సరి చేయక, డిజిటల్ సంతకం చేయక ఇబ్బందికి గురి చేస్తున్నారని అడంగల్ ప్రతి ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు.

గూడూరు మండలం కంచ కోడూరు గ్రామ వాస్తవ్యులు కోళ్ల ఏ కె పి గోపాలకృష్ణమూర్తి తనతో పాటు మరో ముగ్గురికి గత సంవత్సరం సంభవించిన మీచౌంగ్ తుఫాను సందర్భంగా సార్వా వరి పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ మంజూరైనప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని ఇకనైనా తనకు రావాల్సిన నష్ట పరిహారం అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

పామర్రు మండలం జమీగొల్లేపల్లి గ్రామవాసి పెద్దు సుధాకర్ రావు మాట్లాడుతూ జీవిస్తున్నానని, తనకు 063903000530 నంబర్తో తెల్ల రేషన్ కార్డు ఉన్నదని, రేషన్ బియ్యం ఇస్తూ మధ్యలో మానివేశారని, అర్హత ఉన్న రేషన్ బియ్యం ఇవ్వడం లేదని ఇకనైనా ప్రభుత్వం రేషన్ బియ్యం అందించేలా చూడాలని కోరుతూ విజ్ఞాపన అందజేశారు.

బాపులపాడు మండలం, కనుమోలు గ్రామ కాపురస్తులు బోడిచర్ల నరసింహారావు మాట్లాడుతూ మండల కేంద్రమైన నందివాడలో ఆర్ఎస్ నంబర్ 550-2బి లో 1.30 ఎకరాలు సొంత భూమి ఉందని, తన కుమారులు కుమార్తెల పేరు మీద మార్చుటకు సబ్ రిజిస్టర్ కార్యాలయం, గుడివాడకు వెళ్ళగా ఆ భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినదిగా చూపుతున్నదని వారి నుండి నిరభ్యంతర దృవీకరణ పత్రం తెచ్చుకోవాలని తెలిపి ఉన్నారని, ఆ పత్రం ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామానికి చెందిన పాలపర్తి రాజబాబు మూడు చక్రాల సైకిల్ పై కలెక్టరేట్కు రాగా జిల్లా కలెక్టర్ స్వయంగా సమావేశ మందిరం నుండి బయటికి వచ్చి అతనితో మాట్లాడి ఎంతో ఓపిగ్గా అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ తాను షెడ్యూల్ కులాలకు చెందిన వాడని నడవలేనని, ఏ పని చేయలేనని, పొలముగాని నివసించుటకు ఇల్లు గాని ఏమీ లేదని తన సోదరుని దగ్గర తలదాచుకుంటున్నానని, తనకు మూడు చక్రాల సైకిల్ ఉందని చేత్తో తిప్పుకుంటూ నడపలేకపోతున్నానని తనకు మోటారు సైకిలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటూ కలెక్టర్కు అర్జీ అందజేశారు.
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ
దివ్యాంగుల శాఖ పర్యవేక్షకులు ప్రశాంతిని వివరాలు కోరగా ప్రస్తుతం మోటార్ సైకిల్ మంజూరు కోసం మార్గదర్శకాలు అందాల్సి ఉందని కలెక్టర్కు తెలిపారు.
అతని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

తొలుత జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీకోసం అర్జీల జాబితా వస్తోందని వాటిని సకాలంలో సరైన విధానంలో పరిష్కరించాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 3,578 అర్జీలు అందాయని వాటిలో 502 అర్జీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గడువు దాటిన అర్జీలు రెవెన్యూ శాఖలో 7, పోలీస్ శాఖలో 6 పెండింగ్ ఉన్నాయని వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు.

జిల్లాలో 22 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని వాటికి సంబంధించి వెంటనే వకాలత్ దాఖలు చేయాలన్నారు. అనవసరంగా కలెక్టర్ను బాధ్యులుగా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇకపై ప్రతి వారము మీకోసం అర్జీలు, కోర్టు కేసుల పరిష్కారం పై సమీక్ష చేస్తామని తాను కోర్టుకు హాజరయ్యే పరిస్థితి తీసుకురావద్దని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఓ గణేషు, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, సర్వే భూ రికార్డుల ఏడి మనీషా త్రిపాఠి, ఐసిడిఎస్ పిడి సువర్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *