-వ్యవసాయ రుణాలు, సంక్షేమ పధకాల అమలు,రుణ లక్ష్యాలపై సమీక్ష
-2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.18, 256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల
-జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటి సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా బ్యాంకర్లు పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి బ్యాంకర్లకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపుహాలులో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరం రూ. 18,256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా 2 వేల కోట్ల రూపాయల అధికంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం వార్షిక రుణప్రణాళికను రూపొందించడంపై బ్యాంకర్లను మంత్రి అభినందించారు. ఇదే సందర్భంలో కౌలు రైతులకు, చిరువ్యాపారులకు, యువతకు సంబందించి రుణ వితరణ మరింత మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. కౌలు రైతులకు రుణాలు సులభంగా అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రుణాలు సంక్షేమ పధకాల అమలు రుణ లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తికాని దృష్ట్యా లబ్దిదారులకు రుణాలు చెల్లించాల్సిందిగా నోటీసులు ఇవ్వడం తగదని, ఈ విషయంలో వారిపై ఒత్తిడి తేవద్దని మంత్ సూచించారు. ఇదే సమయంలో టిడ్కో ఇళ్ల రుణాలను సాకుగా చూపి ఇతర రుణాల మంజూరులో లబ్దిదారులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. స్వయం సహాయక సంఘాల మాదిరిగానే ఎఫ్.పి.ఓలు, జె.ఎల్.జి., ఆర్.ఎం.జి. గ్రూపులను ప్రోత్సహించి, కౌలు రైతులకు విరివిగా రుణాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వర్షాలు, వరదల మూలంగా పంటలకు అవసరమైన సస్యరక్షణ, ఎరువుల కొనుగోలు కోసం రైతులకు ఈ సమయంలో రుణ సౌకర్యం అవసరమవుతుందన్నారు. రైతులకు ప్రస్తుతం రుణాలు మంజూరు చేస్తే, వారిని ఎంతో ఆదుకున్నవాళ్ళం అవుతామని, రైతులకు కూడా రుణాలు తిరిగి చెల్లించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయన్నారు . పిఎంఈజిపి కింద అందిన దరఖాస్తులు తిరస్కరణకు గల కారణాలను గుర్తించేందుకు స్టాండర్డ్ చెక్ లిస్ట్ ను తయారుచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు చెక్ లిస్ట్ ప్రకారం తనిఖీ చేసి, ఎల్డిఎం తో సంప్రతించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులకు రుణాలు అందించే పథకాలపై ప్రజలలో విస్తృత అవగాహన కలిగించి, మరింత మంది ప్రజలు సద్వినియోగం చేసుకునే బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) విద్యార్థుల ఉన్నత విద్య కోసం మంజూరు చేసే విద్యా రుణాల మంజూరుకు నిర్దేశించిన పరిమితిలో మంజూరు చేసే రుణాలకు సానుకూలంగా వ్యవహరించాలన్నారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివరాలు :
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి రూ.18, 256 కోట్లతో వార్షిక రుణ ప్రణాలికను విడుదల చేయగా, వ్యవసాయానికి 12, 632 కోట్ల రూపాయలు, ఇందులో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు రూ.7943 కోట్లు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు రూ.2452 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.695 కోట్లు, మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 15 వేల 778 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 2478 కోట్లు కేటాయించడం జరిగింది. .
సమావేశంలో ఆర్బీఐ ఎల్డివో పి .ఎం. పూర్ణిమ, లీడ్ బ్యాంకు రీజినల్ హెడ్ నాంపల్లి శ్రీనివాస్, డిఆర్డిఏ ఆర్. విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ భాషా, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు,ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహన్, మత్స్య శాఖ జేడీ నాగలింగాచారి, బి.సి., కార్పొరేషన్ ఈడీ ఎన్ .పుష్పలత, జిల్లా మైనారిటీస్ అధికారి కృపావరం, సెరీకల్చర్ డిడి శ్రీవాణి, ఎల్డిఎం డి. నీలాద్రి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News