-విఐపి దర్శనాలకు ప్రత్యేక యాప్
-రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం
-విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి కనకదుర్గమ్మ వారి అనుగ్రహం ఉండాలని జగన్మాతను ప్రార్థించినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. శుక్రవారం గాయత్రి దేవి అలంకరణతో ఉన్న కనకదుర్గమాతను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సత్వర దర్శనం చేసుకునేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే వివిధ రంగాల ప్రముఖులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించామన్నారు. ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవాదాయ శాఖ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపొందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.