గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో రోడ్ల మీద ప్యాచ్ వర్క్ లను వెంటనే చేపట్టాలని, ప్యాచ్ వర్క్ కి ముందు, తర్వాత ఫొటోలతో ఫైల్ మెయిన్టైన్ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగి అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ పెద్ద పలకలూరు రోడ్, జెకెసి కాలేజి రోడ్, పట్టాభిపురం, విద్యా నగర్ మెయిన్ రోడ్, కెవిపి కాలనీ రోడ్, నల్లచెరువు రోడ్, జిటి రోడ్ లను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి ప్యాచ్ వర్క్ లపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ఆర్&బి, నగరపాలక సంస్థకు చెందిన ప్రతి రోడ్ లో ఏ విధమైన పాట్ హోల్ ఉండడానికి వీలులేదని, తక్షణం ఏఈల వారీగా తమ పరిధిలోని రోడ్ల మరమత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్యాచ్ వర్క్ లు నాణ్యతతో ఉండాలని లేకుంటే సంబందిత పర్యవేక్షణ కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాట్ హోల్ కి చేపట్టే ప్యాచ్ వర్క్ లకు ముందు, తర్వాత ఫొటోలతో ఫైల్ సిద్దం చేసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే రోడ్లు తప్పనిసరిగా ఎండ్ టు ఎండ్ ఉండేలా ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అనంతరం బ్రాడిపేట 4వ లైన్ రోడ్ ని పరిశీలించి, 2 రోజుల్లో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ కి స్పష్టం చేశారు. రోడ్ ఏర్పాటు సమయంలో ఆక్రమణలు ఎక్కడైనా ఉంటే పట్టణ ప్రణాళిక అధికారుల సమన్వయంతో తొలగించాలన్నారు. అలాగే డ్రైన్ల పై స్లాబ్ లు ఉన్న వాటిని తొలగించి, వ్యర్ధాలు తీయడానికి వీలుగా గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలియచేయాలన్నారు. బ్రాడిపేట 14, 19 వ అడ్డరోడ్ ల్లో డ్రైన్ల పై ఆక్రమణల వలన వర్షాలు మురుగు పొంగి తమ ఇళ్ళల్లోకి వస్తుందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి, డ్రైన్ల ఆక్రమణదారులకు ముందస్తుగా ఆక్రమణలు తొలగించాలని సమాచారం అందించి, వారు స్పదించకుంటే తొలగించాలన్నారు. పీకలవాగుని పరిశీలించి, వాగులోకి స్థానికంగా ఉన్న మైనర్ డ్రైన్లు నేరుగా కలిసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు. కాల్వల్లో వ్యర్ధాలు వేసే కమర్షియల్ సంస్థలు, టిఫిన్, టీ దుకాణదార్లకు అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను, ఇంటింటి చెత్త సేకరణ చేసేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. జోసఫ్ నగర్ చంద్రభానుడి చెరువుని పరిశీలించి, పూర్తి స్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అనంతరం నల్లచెరువు రిజర్వాయర్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ త్రాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధికారులు సమర్దవంతంగా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ట్యాంకర్ల వివరాలను రిజిస్టర్ లో నేరుగా పరిశీలించి, త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రైవేట్ అవసరాలకు తరలిస్తున్నారని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, అటువంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఈలు తమ పరిధిలో త్రాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని, అన్ని ప్రాంతాలకు సమానంగా సరఫరా జరగాలన్నారు. పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, ఏఈలు సూరిబాబు, శ్రీకాంత్, నాగవేణి, శానిటరీ సూపర్వైజర్ సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు డేవిడ్, బాబు, ఏడుకొండలు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News