మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
“పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం క్రింద జిల్లాలో ఈనెల 14 నుండి 20 వరకు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. “పల్లె పండగ-పంచాయతీ వారోత్సవాలు” కార్యక్రమం నిర్వహణపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 168 కోట్లతో 2331 పనులు మంజూరు చేసినట్లు, మంజూరైన పనులన్నీ పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుండి గ్రామాల్లో శంకుస్థాపనలు చేయడానికి షెడ్యూల్ రూపొందించడం జరుగుతుందన్నారు. చేపట్టిన పనులన్నీ వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పి సీఈవో కె.కన్నమ నాయుడు, డ్వామా పిడి ఎన్.వి శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ ఇ రమణారావు, డిపిఓ జె అరుణ, హౌసింగ్ పీడీ ఎస్. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News