Breaking News

పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరుకావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ 100 రోజుల జిల్లా కార్యాచరణ ప్రణాళిక పై వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. చాలామంది అధికారుల పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా జిల్లాకు వచ్చిన చాలామంది జిల్లా అధికారులు సమావేశాలను తేలిగ్గా తీసుకుంటున్నారని, సరైన పూర్తి సమాచారం లేకుండా సమావేశాలకు రావడం సరైనది కాదని స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి 2 నెలలు అయిందని, అప్పటినుండి 100 రోజుల్లో జిల్లాలో చేయవలసిన వివిధ పనుల గురించి జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఆ ప్రణాళిక ప్రకారం ఏ మేరకు సాధించారో పరిశీలిస్తే కేవలం రెండు మూడు శాఖల తప్ప దాదాపు అన్ని శాఖల అధికారులు సరిగా పట్టించుకోక చాలా వెనుకబడి ఉన్నారన్నారు. జిల్లా అధికారుల వాట్సాప్ గ్రూప్లో సూచనలు ఇచ్చినప్పటికీ చాలామంది అధికారులు వాటిని ఏమాత్రం చూడటం లేదన్నారు. కొందరు అధికారులు చూసినప్పటికీ సరిగా పట్టించుకోవడం లేదన్నారు. తన సమావేశానికి అన్ని విధాల తయారై రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. గ్రూప్ లో ఇచ్చిన సూచనలు పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఇటువంటి నిర్లక్ష్యం ధోరణి సహించేది లేదని ఇకపై పునరావతం కాకుండా అప్పగించిన పనులను సజావుగా చేయడంతో పాటు సరైన నివేదికలు తీసుకురావాలని హెచ్చరించారు. మరలా జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రికి జిల్లా వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై మరలా ఇంకొక సమావేశం నిర్వహిస్తామని ఆలోగా అన్ని పనులు సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరై వచ్చినందున త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం ఒక వారంలోగా కల్పించాలన్నారు. అలాగే మరుగుదొడ్లను కూడా వీలైనంత త్వరగా నిర్మించాలన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశానికి రాకపోవడంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఎవరైనా జిల్లా అధికారులు తన అనుమతితో సెలవులో వెళితే వారి తరఫున తదుపరి స్థాయిలో ఉన్న అధికారులు సమావేశానికి సరైన సమాచారంతో తప్పకుండా హాజరుకావాలని స్పష్టం చేశారు.

ఉపాధి హామీ నిధులతో 388 పంట కుంటలు నిర్మించాల్సి ఉండగా 350 పూర్తయ్యాయని, 580 ఎకరాల్లో ఉద్యాన తోటలు పెంపకం జరగాల్సి ఉండగా 619 ఎకరాల్లో పెంపకం పూర్తి అయిందని, రహదారి మొక్కల పెంపకం 200 ఎకరాల్లో జరగాల్సి ఉండగా 235 ఎకరాల్లో పూర్తయిందని, వివిధ సంస్థల్లో మొక్కల పెంపకం 25 ఎకరాలకు గాను 12 ఎకరాల్లో పూర్తయిందని, 34 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కు గాను 25 ఎకరాల్లో పూర్తయిందని, 54 ట్రెంచులకు గాను 57 ట్రెంచులు, 20 కిలోమీటర్ల సిసి రోడ్లకు గాను 6.1 కిలోమీటర్ల రోడ్డు, 12 కిలోమీటర్ల మురికి కాలువలకు గాను 7 కిలోమీటర్ల కాలువలు, 3 కిలోమీటర్ల బిటి రోడ్డుకు గాను ఒక కిలోమీటర్లు రోడ్డు పూర్తయ్యాయని డ్వామా పిడి కలెక్టర్కు వివరించారు.

రహదారుల మరమ్మతు కోసం పిలిచిన టెండర్లు ఖరారయ్యాక సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు కలెక్టర్ సూచించారు. వివిధ అంశాలకు సంబంధించి రోజువారి నివేదిక ఇచ్చేందుకు నిర్ణీత నమూనా పంపుతున్నామని ఆ నమూనాలో వివరాలు భర్తీ చేసి అందజేయాలన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో చురుగ్గా లేని, నిరర్థకంగా ఉన్న నిధులను సరిచేసి సౌకర్యం కల్పించినప్పటికీ ఆ నిధులను వినియోగించుకోకపోవడం సరైనది కాదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డ్వామా పిడి శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణరావు, సిపిఓ గణేషు, విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యానందం, జడ్పిసి సీఈఓ కన్నమనాయుడు, డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, ఆర్ అండ్ బి అధికారి లోకేష్, మార్క్ఫెడ్ ఏడి మురళీకృష్ణ, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ,జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, డిటిసి మనీషా డి ఎఫ్ ఓ సునీత, సర్వే భూ రికార్డుల ఏడి జోషిలా, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, వృద్ధులు దివ్యాంగుల శాఖ ఏడి కామరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *