గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, దూడలను వెంగళాయపాలెంలోని జిఎంసి బందెలదొడ్డికి తరలిస్తున్నామని, ఆయా పశువుల యజమానులు రోడ్ల మీదకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం నగరంలోని మార్కెట్, నల్లచెరువు, లక్ష్మీపురం, లాడ్జి సెంటర్, బృందావన్ గార్డెన్స్ ప్రాంతాల్లో రోడ్ల మీద ట్రాఫిక్ కి అడ్డుగా ఉన్న ఆవులను జిఎంసి బందెలదొడ్డికి నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు తరలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన రహదారులపై పశువులు విచ్చలవిడిగా ఉండడం వలన వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సమయాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే పలుమార్లు పశువులను రోడ్ల మీదకు వదిలితే తగు చర్యలు తీసుకుంటామని తెలియచేసినా యజమానులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని అన్నారు. ప్రజా ప్రయోజన దృష్ట్యా రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులు, దూడలను జిఎంసి బందెలదొడ్డి కి తరలించాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బందెలదొడ్డికి తరలించిన పశువులను విడుదల చేయాలంటే భారీ అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News