Breaking News

సేవా సంస్థలో విష సర్పాలు!

-కోట్లాది రూపాయల ఆస్తుల కోసం మూడు సంస్థల కుయుక్తులు
-ప్రశ్నార్థకంగా ‘క్యాంపస్ ఛాలెంజ్’ చిన్నారుల భవిష్యత్తు
-చిన్నారుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
అభాగ్యులైన చిన్నారుల కోసం నిర్వహించబడుతున్న ఓ సేవా సంస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి. రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ సమీపంలో కొత్త కొప్పెర్ల గ్రామ పరిధిలోని ఓ సేవా సంస్థను అమాంతం మింగేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం, క్యాంపస్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించబడుతున్న సేవా సంస్థకు దాదాపు ఐదు ఎకరాల భూమి, అందులో పలు భవనాలు.. వెరసి, సుమారు 35 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని వివరించారు. సదరు ఆస్తులపై కన్నేసిన మూడు సంస్థలు.. సొసైటీలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయని.. పారదర్శకమైన న్యాయ విచారణ ద్వారా చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సివుందని రమేష్ బాబు పేర్కొన్నారు. “నెదర్లాండ్ దేశానికి చెందిన ఫ్రెండ్స్ ఇండీడ్ అనే ఎన్జీవో సంస్థ, అనేక మంది విదేశీయుల నుంచి విరాళాలు సేకరించి, జిల్లాలోని ఆర్థర్ సొసైటీకి అందించింది. మొత్తం రూ. 24 కోట్ల విరాళాలతో, సొసైటీకి చెందినదిగా చెప్పబడుతున్న స్థలంలో పలు భవనాలను నిర్మించారు. కొంత కాలం తర్వాత, నెదర్లాండ్ సంస్థ ఫ్రెండ్స్ ఇండీడ్ ప్రతినిధి ఆర్ధర్ సొసైటీ ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థర్ సొసైటీ ప్రతినిధులు నకిలీ భూ పత్రాలతో మోసగించారని, దాదాపు రూ. 10 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల మేరకు 8 మార్చి 2014న పూసపాటిరేగ పోలీసులు కేసు (ఎఫ్ఐఆర్ నెం.41/2014) నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆర్థర్ సొసైటీ ప్రతినిధులతో ఫ్రెండ్స్ ఇండీడ్ ప్రతినిధి బేరసారాలు సాగించారు. ప్రారంభంలో తమ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. సొసైటీ మొత్తం ఆస్తులను తాము కోరిన సంస్థకు బదలాయించేలా రాజీ కుదుర్చుకున్నారు. అప్పటి వరకు ఈ వ్యవహారంతో అస్సలు సంబంధం లేని అసోసియేషన్ సాయికొరియన్ అనే సంస్థ హఠాత్తుగా తెర పైకి వచ్చింది. ఆర్థర్ సొసైటీలో పాగా వేసి, ప్రస్తుతం వివాదంలో ఉన్న సొసైటీని క్యాంపస్ ఛాలెంజ్ పేరుతో అక్రమంగా నిర్వహిస్తోంది. నెదర్లాండ్స్ నుంచి నిధులు సమీకరించిన ఫ్రెండ్స్ ఇండీడ్ సంస్థ.. సేవా సంస్థను తొలుత నిర్వహించిన ఆర్థర్ సొసైటీ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసోసియేషన్ సాయికొరియన్ సంస్థలు.. ఆయా సంస్థల ప్రతినిధులు.. అందరూ కలిసి, అభాగ్యులైన చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న సేవా సంస్థను మింగేయాలని కుట్ర పన్నారు” అని రమేష్ బాబు ఆరోపణాస్త్రాలను సంధించారు. నిస్సహాయులైన చిన్నారుల తరపున తాము గత రెండున్నరేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆర్థర్ సొసైటీ ప్రతినిధులపై ఫ్రెండ్స్ ఇండీడ్ ప్రతినిధి పెట్టిన కేసు (సి.సి.నెం.452/2018-ఎక్సైజ్ కోర్ట్, విజయనగరం)లో తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోరుతూ, న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశామని గుర్తి చేశారు. అంతేకాకుండా.. అసోసియేషన్ సాయికొరియన్, ఆర్థర్ సొసైటీ, ఫ్రెండ్స్ ఇండీడ్ సంస్థలతో పాటు, సదరు సంస్థల బాధ్యులను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో ప్రైవేటు కంప్లైంట్ కూడా దాఖలు చేసినట్లు చెప్పారు. మూడు సంస్థల కుట్రలకు బలైపోతున్న చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని, చట్టాలను అతిక్రమించి అనేక నేరపూరిత కుట్రలకు పాల్పడిన ఆ మూడు సంస్థలపై చర్యలు తీసుకోవాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *