Breaking News

ఈ నెల 27న డయాబ్ ఎండో కాన్ 2024

– ఆధునిక చికిత్సలు, నవీన ఆవిష్కరణలపై వైద్య ప్రముఖుల ప్రసంగాలు
– ప్రఖ్యాత ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్ మెడల్ ప్రదానం
– యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యలమంచి సదాశివరావు
– డయాబ్ ఎండో కాన్ 2024 బ్రోచర్ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27వ తేదీ ఆదివారం నాడు డయాబ్ ఎండో కాన్ 2024 వైద్య సదస్సును నిర్వహిస్తున్నట్లు యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. సూర్యారావుపేటలోని వైడీఆర్ఎఫ్ రీసెర్చ్ సెంటర్ నందు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్ నందు ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డయాబెటిస్ సదస్సు నిర్వహిస్తున్నామని, ఎండోక్రైనాలజీ విభాగాన్ని కూడా జతచేసి, ఈ ఏడాది డయాబ్ ఎండో కాన్ 2024కు రూపకల్పన చేశామని అన్నారు. ఈ సదస్సులో 25 మంది నిష్ణాతులైన వైద్య ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారని, మొత్తం 500 మందికి పైగా వైద్యులు హాజరవుతారని పేర్కొన్నారు. ఎండోక్రైనాలజీ, డయాబెటిస్ విభాగాలకు సంబంధించిన ఆధునిక చికిత్సలు, నవీన ఆవిష్కరణల గురించి తెలుసుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా ఉంటుందని అన్నారు. మధుమేహ వ్యాధి చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ఆధునిక చికిత్సా విధానాలపై అధ్యయనం చేసేందుకు, తద్వారా ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ఈ సదస్సు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. వైద్య చికిత్సలు, పరిశోధనా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి ప్రతి ఏటా బంగారు పతకాన్ని ప్రదానం చేస్తూ వస్తున్నామని, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి ఈ ఏడాది గోల్డ్ మెడల్ ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. మధుమేహ వ్యాధి చికిత్సా పద్ధతులు పూర్తిగా ఆధునికతను సంతరించుకున్నాయని, నియంత్రణలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. ప్రీ డయాబెటిస్ దశలోనే తగు జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం ముప్పు నుండి తప్పించుకోవచ్చని సూచించారు. టైప్-1 డయాబెటిస్ ను అడ్డుకోవడానికి నూతన ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, జీవన విధానాల్లో మార్పులు, సరైన చికిత్సలు తీసుకోవడం ద్వారా మధుమేహ వ్యాధిని తిప్పికొట్టవచ్చని వెల్లడించారు. మధుమేహ వ్యాధి తీవ్రంగా ఉండటం వల్ల గుండెపోటు వంటి అనేక ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోందని అన్నారు. మధుమేహం, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించిన అనేక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు రెండు సీఎంఈ క్రెడిట్స్ అందిస్తున్నట్లు డాక్టర్ సదాశివరావు చెప్పారు. 2002లో యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించామని, నాటి నుండి అనేక అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వస్తున్నామని డాక్టర్ సదాశివరావు తెలియజేశారు. డయాబ్ ఎండో కాన్ 2024 బ్రోచర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైడీఆర్ఎఫ్ ట్రస్టీ డాక్టర్ హిమన యలమంచి, సెక్రటరీ డాక్టర్ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అమూల్య యలమంచి పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *