Breaking News

పని నిర్దేశిత టైం లైన్ మేరకు పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, ప్రతి పని నిర్దేశిత టైం లైన్ మేరకు పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎంఎల్ఏ డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో ఎంఎల్ఏ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ  మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబందించిన 8 వార్డ్ లు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నాయని, వాటిలో ప్రజలకు తక్షణం మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం ఉందని, ప్రతి పని నిర్దేశిత టైం లైన్ మేరకు పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గోరంట్ల కొండ మీద సాగుతున్న రిజర్వాయర్ నిర్మాణ కాంట్రాక్టర్ ని పిలిచి పనులను వేగంగా చేపట్టేలా ఇంజినీరింగ్ అధికారులు చొరవ చూపాలని, రిజర్వాయర్ పూర్తి అయితే అనేక ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. 8 వార్డ్ లు శివారు ప్రాంతాల్లో ఉన్నందున వీధి దీపాలను అధిక ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. వార్డ్ ల వారీగా ప్రతి 15 రోజులకు ఒకసారి మెగా శానిటేషన్ డ్రైవ్ చేపట్టి సమగ్ర పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యాంటీ లార్వా యాక్టివిటి చేపట్టాలన్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్ళలో నిర్లక్ష్యం వద్దని, పాత బకాయిలు ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయని ప్రశ్నించారు. బకాయిల వసూళ్లతో పాటు లే అవుట్ ల వారీగా వివరాలు తీసుకొని ఖాళీ ప్లాట్ లకు ఖాళీ స్థల పన్ను విధించడం ద్వారా జిఎంసికి ఆదాయం వస్తుందని తెలిపారు. పన్ను విధింపు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక విజిలెన్స్ ఉండాలని, అందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణ ప్రణాళిక విభాగ సమీక్షలో అధికారులతో మాట్లాడుతూ నగర పరిధిలో అనధికార వెంచర్లు పెరుగుతున్నాయని, పట్టణ ప్రణాళిక అధికారులు వాటి పై చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార వెంచర్లలో ప్లాట్ లు కొని సాదారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి వెంచర్ జిఎంసి నుండి అనుమతి తీసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను అంతర్గతంగా బదిలీలు చేపట్టాలన్నారు. జిఎంసి ఖాళీ స్తలాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని ఆక్రమణలకు గురి కాకుండా పార్క్ లు అభివృద్ధి చేయాలన్నారు.

సమావేశంలో కార్పొరేటర్లు ఎన్.బాలాజీ, వై.పద్మావతి, డి.లక్ష్మీ దుర్గ, అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, సిటి ప్లానర్ రాంబాబు, ఈఈలు, ఎంహెచ్ఓలు, డిసిపి, ఏసిపి,ఆర్.ఓ.లు, ఇంజినీరింగ్, ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *