అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన ఉపాధితో మంచి జీవితాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్ సంస్థ) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ శ్రీ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని సీడ్ యాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధి పై వర్క్ షాపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీడ్ యాప్ సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన శిక్షణ, నైపుణ్యం కల్గిన యువతను అందించేందుకు సీడ్ యాప్ సన్నద్ధంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన అత్యాధునిక ఆరు విధానాల రూపకల్పనలో సీడ్ యాప్ ఉందన్నారు.. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే వారికి స్కిల్డ్ యువతను అందిస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం మరియు భవిష్యత్ లో పరిశ్రమల డిమాండ్లకు అవసరమైన వారి కోసం నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయమన్నారు.
సీడ్ యాప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా. కె. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ 2005 నుండి వివిధ నైపుణ్యాభివృద్ధి పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలో సీడ్ యాప్ సంస్థ విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వ చొరవ తో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ’ అమలులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, లెదర్, ఫర్నీచర్ & ఫిట్టింగ్స్, ఫుడ్ ఇండస్ట్రీ, కెపాసిటీ & స్కిల్ ఇనిషియేటివ్, రత్నాలు & ఆభరణాలు, హస్తకళలు, గృహ కార్మికులు, వికలాంగులు మరియు క్రీడల కు సంబంధించిన అధికారులతో వర్క్ షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపులో వివిధ రంగాల్లో శిక్షణా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రాలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడం కోసం వివరణాత్మక చర్చలు కూడా జరిగాయి. శిక్షణ మరియు నాలెడ్జ్ పార్టనర్‌షిప్ సహకారం కోసం సీడ్ యాప్ లెదర్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ మరియు ఫర్నీచర్ & ఫిట్టింగ్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో ఒక అవగాహన ఒప్పందం జరిగింది.. ఈ వర్క్ షాపులో సీడ్ యాప్ సంస్థ సిబ్బంది మరియు డీడీయూజీకేవై ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.