Breaking News

పర్యాటకులకు శుభవార్త.. నేటి (అక్టోబర్ 26) నుండి అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం

-పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి
-కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు.. పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచన ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్
-రాజమహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ఉదయం 6 గం.లకు బస్సులు ప్రారంభం.. రాత్రి 7.30 కి ముగియనున్న ప్రయాణం..
-మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డ్ డైరెక్టర్ల చేతుల మీదుగా నేటి నుండే బస్సులు ప్రారంభం
-పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు రూ. 800 టికెట్.. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన మంత్రి దుర్గేష్
-యాత్రికులకు సౌలభ్యంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యాత్రికుల హృదయాలకు, మనస్సులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు అధ్యాత్మిక ప్రయాణ పర్యాటక ప్యాకేజీని నేటి నుండి (అక్టోబర్ 26) ప్రారంభించబోతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో పలువురు ఎమ్మెల్యేల సూచనల మేరకు వారాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పంచారామ క్షేత్రాలను కలిపేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో తనతో పాటు ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం శాఖ ఉన్నతాధికారులు, బోర్డ్ డైరెక్టర్ల చేతుల మీదుగా బస్సులు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ టూర్ ప్యాకేజీ వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన క్షేత్రమైన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం దర్శించిన అనంతరం రత్నగిరి కొండపై వెలసి భక్తుల కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం, ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం దర్శించిన పిమ్మట విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు దర్శించుకొంటారని తెలిపారు. సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అత్యంత ప్రాచీన మహిమాన్విత శివ లింగ క్షేత్రం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారని తెలిపారు. ఆ తర్వాత కోనసీమ తిరుపతిగా, ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా భక్తులచే కీర్తి పొంది విశేషంగా ఆకట్టుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని యాత్రికులు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని నిర్ణయించామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అక్టోబర్ 26 నుండి బస్సులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్ వద్ద పర్యాటక శాఖకు సంబంధించిన సమాచార మరియు రిజర్వేషన్ కేంద్రం వద్ద ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరే పర్యాటకుల బస్సు కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాల మీదుగా రాత్రి 7.00 గంటలకు రాజమహేంద్రవరంలోని హేవలాక్ బ్రిడ్జి దగ్గర పుష్కర్ ఘాట్ కు చేరుకుంటుందన్నారు. అక్కడే పవిత్ర గోదావరి నదికి కన్నుల పండువగా హారతి ఇచ్చే ప్రాంతంలో మంత్ర ముగ్ద దృశ్యాలను భక్తులు తిలకించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. భక్తులు అధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలేలా కార్యక్రమం పూర్తయిన అనంతరం 7.30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరంలోని ఏపీటీడీసీకి చెందిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్దకు భక్తులను చేరవేస్తామన్నారు. ఇంతటితో యాత్ర సమాప్తమవుతుందన్నారు. వివరాలకు యాత్రికులు ఐఆర్ఓను సంప్రదించాలని తెలిపారు.

18 మంది సీటింగ్ సామర్థ్యంతో బయలుదేరే బస్సు ఆద్యంతం ప్రకృతి రమణీయత దృశ్యాల నడుమ ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్న ఈ అధ్యాత్మిక యాత్ర భక్తులకు మానసికోల్లాసాన్ని కలిగించి అధ్యాత్మిక భావనను పెంచుతుందని భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు. భక్తుల కోరిక మేరకు 18 మంది సమూహంతో పర్యాటక శాఖను సంప్రదిస్తే ప్రయాణం ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పెద్దలకు రూ.1000, 3-10 ఏళ్లలోపు చిన్నారులకు రూ.800 టూర్ ఛార్జీగా నిర్ణయించామన్నారు. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికతో కూడిన టూర్ ప్యాకేజీని యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. అధ్యాత్మిక భావంతో పాటు సాంస్కృతిక, చారిత్రాత్మిక ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే టూర్ ప్యాకేజీ ముఖ్యోద్దేశమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *