Breaking News

ఈ నెల 16న పోలవరం ప్రాంతంలో జరిగే అఖిలపక్ష పర్యటన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆదివారం  విజయవాడ దాసరి భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తిలతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించగా, సమావేశం పలు అంశాలపై చర్చలు జరిపింది. సమావేశ నిర్ణయాలతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలను నిరసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత 150 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మకునీరెత్తినట్లుగా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పార్టీల కతీతంగా మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. జగనన్న ఇళ్లు అగ్గిపెట్టెల తీరుగా ఉన్నాయి. పేదలకు ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని గతంలో చెప్పగా, ఇప్పుడు లబ్ధిదారులే నిర్మాణాలు చేపట్టాలని చెప్పడం సరికాదు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రు.1.80 లక్షలు పునాదివరకు మాత్రమే సరిపోతాయి. మిగిలిన నిర్మాణం కోసం ప్రజలు అప్పులు వెతుక్కోక తప్పే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం ఒక కుటుంబానికి ఏమాత్రం నివాసయోగ్యం కాదు. పట్టణాలలో కనీసం 1.5 సెంట్లు ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జగనన్న ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నాణ్యతాలోపం లేకుండా నిర్మాణం గావించి పేదలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. పర్యావరణకు పెను విఘాతంగా పరిణమించిన బాక్సైట్ తవ్వకాలను విరమించుకోవాలి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, ఆదివాసీలు ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళనకు సిద్ధం కావాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలు, విభాగాలలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని ఆర్థిక శాఖ చెబుతోంది. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్మోహనరెడ్డి హామీలు గత రెండేళ్లుగా నీటిమూటలయ్యాయి. జూన్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి 10,143 ఉద్యోగాల భర్తీకై అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పట్ల నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉద్యమబాట పట్టాయి. నిరుద్యోగ, యువజన, విద్యార్థులు చేపట్టిన పోరాటానికి సిపిఐ సంఘీభావం, మద్దతు తెలుపుతున్నాము. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు, పోలీసులు బెదిరించడాన్ని, బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరం నిర్వాసితులకు తగు న్యాయం జరిగే వరకు సిపిఐ అండగా నిలబడుతుందని స్పష్టం చేస్తున్నాం. ఈ నెల 16న పోలవరం ప్రాంతంలో జరిగే అఖిలపక్ష పర్యటనలో సిపిఐ పాల్గొననున్నది.

Check Also

రాజమహేంద్రవరం  విమానాశ్రయం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా..

-ఇండిగో విమాన సర్వీస్ ఉదయం 9.00 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంది. -నియమాలను అనుసరించి ఎయిర్ బస్ కు నీటిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *