– వచ్చే అయిదేళ్లలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– గిరిజన గ్రామాలను రహదారులతో అనుసంధానం
– కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులకు ప్రోత్సాహం
– గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు
– భగవాన్ బిర్సా ముండా జీవితం భావితరాలకు ఆదర్శం
– కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని.. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి, జన్ జాతీయ గౌరవ దినోత్సవం, గిరిజన స్వాభిమాన ఉత్సవాలు-2024ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నేతలు తదితరులతో కలిసి శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించారు. గిరిజనుల సంప్రదాయ నృత్యం థింసాతో అతిథులకు గిరిజన మహిళలు స్వాగతం పలికిన అనంతరం.. గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండాతో పాటు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బీహార్‌లోని జమూయ్‌లో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో దేశ ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వర్చువల్‌గా తిలకించిన అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒక వీరునిగానే కాకుండా న్యాయం, సమానత్వం కోసం పోరాడిన బిర్సా ముండా వంటివారి జీవితం ఆదర్శప్రాయమని.. వారి ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అవమానాలను అణగదొక్కుకొని, ఆత్మాభిమానాన్ని అలంకరించుకొని బిర్సా ముండా స్వేచ్ఛకోసం పోరాడి.. ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల కృషిని స్మరించుకునేందుకు, మన సాంస్కృతిక వారసత్వాన్ని, జాతీయ గౌరవ పరిరక్షణకు ప్రధాని 2021లో బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్-గిరిజన స్వాభిమాన ఉత్సవాలను ప్రకటించడం జరిగిందన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద నేడు ప్రధానమంత్రి దాదాపు రూ. 6 వేల కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి 50 మల్టీ పర్పస్ కేంద్రాలను రూ. 30 కోట్లతో చేపట్టడం జరుగుతుందన్నారు. 100మందికి పైబడిన జనాభా ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేయడం జరుగుతుందని.. ప్రతి గిరిజన గ్రామానికి పక్కా ఇళ్లు, తాగునీటి కుళాయిలు, అంగన్వాడీ కేంద్రాలు, సౌర విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉపముఖ్యమంత్రి సారథ్యంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందని.. అరకు కాఫీకి ముఖ్యమంత్రి కృషివల్లే జాతీయస్థాయి గుర్తింపు లభించిందని.. వివిధ గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ వాటికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకొని కృషిచేస్తున్న ముఖ్యమంత్రి:
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఎందరో గిరిజన వీరులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలు వీలుకల్పిస్తున్నాయన్నారు. గౌరవ నందమూరి తారకరామారావు మొదటిసారిగా గిరిజనుల ఉనికిని గుర్తించి వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ఎనలేని కృషిచేశారని పేర్కొన్నారు. ఇదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషిచేస్తున్నారన్నారు. రహదారులతో అనుసంధానం కోసం రూ. 2,500 కోట్లు ప్రకటించారన్నారు. ఫీడర్ అంబులెన్సులు, అంబులెన్సుల వ్యవస్థను పటిష్టపరచి మారుమూల ఆదివాసీ గ్రామానికి సైతం మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం హయాంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధితో ముడిపడిన 18 పథకాలను నిర్వీర్యం చేశారని.. మళ్లీ వీటిని ఇప్పుడు పునరుద్ధరించి, వారిని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. 95 గిరిజన మండలాల్లో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారులు వంటి అయిదు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గం సాలూరు పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని.. త్వరలోనే ఈ వర్సిటీ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు సీహెచ్‌సీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న మలేరియా, ఫైలేరియా, రక్తహీనత మందులు పీహెచ్‌సీల్లోనూ అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని.. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
జనజాతీయ గౌరవ దివస్, ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాల ఔన్నత్యాన్ని, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ శుక్లా, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు వివరించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన లబ్ధిదారులకు అటవీ భూహక్కు పత్రాలు, ఆధార్ కార్డులు, ఎల్‌పీజీ కనెక్షన్లు తదితరాలు అందించారు.
కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సమిధా సింగ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, సంచాలకులు సదా భార్గవి; ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. నిధి మీనా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.