Breaking News

ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరిస్తాం : సజ్జల రామకృష్ణా రెడ్డి


-ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి పదవీ విరమణ అభినందన సభలో పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది. దశల వారీగా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

గురువారం తాడేపల్లిలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లమారు చంద్ర శేఖర్ రెడ్డి పదవీ విరమణ అభినందన సభలో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. సభకు ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, ఏ.పి.ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన రెడ్డి, ఏ.పి.ఎన్.జి.ఓ రాష్ట్ర నాయకులు, ఏ.పి.జే.ఏ.సి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి జ్యోతి వెలిగించి, ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, అన్ని ఉద్యోగ సంఘాలను ఒకే మాదిరిగా చూడాలన్నా ఉద్దేశ్యంతో ఉద్యోగుల సమస్యలన్నీ సాధ్యమైనంత వరకు పరిష్కరించే దిశగానే చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విప్లవాత్మకమైన పధకాలను అమలు చేస్తున్నారన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తున్నారన్న ఆలోచనా ధోరణితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. ప్రభుత్వ పధకాలను సక్రమంగా అమలు చేయడం కోసం లక్షాలాది మంది ఉద్యోగులు కష్టమైనా ఇష్టంగా పని చేయడంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు తీసుకువచ్చిన సమస్యలను అర్ధం చేసుకుని, పూర్తిగా చర్చించి, పారదర్శకంగా వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన విధంగా ఉద్యోగులకు ఐఆర్ అమలు చేస్తూ వెంటనే నిర్ణయం తీసుకున్నారని, సి పి ఎస్ రద్దు కు సంబంధించి నియమించిన కమిటీ నివేదికలో కొన్ని కష్టతరమైన సమస్యలు వున్నాయని తెలిసినప్పటికీ, వీలైనంత త్వరగా ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వంపై దాదాపు మూడు లక్షల వేల కోట్లు అప్పులున్నాయని, అరవై వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడవక ముందే కోవిడ్ మహమ్మారి తో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయన్నారు. కోవిడ్ నివారణ చర్యల లోనూ, ఎన్నికల మ్యానిఫేస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాల అమలుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన చేయడానికి క్యాబినెట్ లోని మంత్రులు, బ్యూరోకాట్స్, క్షేత్రస్థాయిలోని నాల్గవ తరగతి ఉద్యోగుల వరకు ఒకే ధోరణితో పని చేయాలన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మహా యజ్ఞంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులలో జవసత్వాలు నింపేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండు వందల శాతం పూర్తి చేస్తారన్న హామీని ఇస్తున్నాని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి ఫైనాన్సియల్, సర్వీస్, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేకమైన మెకానిజంను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ స్థాయిలో పౌర సేవలను ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాయల వ్యవస్థను తీసుకువచ్చి, ఒకేసారి 1.30 లక్షల రెగ్యులర్ ఉద్యోగులను నియమించారన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పధకాలతో ఉద్యోగుల బాధ్యత మరింతగా పెరిగిందని, వారు ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకుని, విచక్షణతో బాధ్యతలు నిర్వహించాలన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజూ పదిహేను నుండి పదహారు గంటలు సమీక్షలు చేస్తూ, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఉద్యోగులు సహకరించాలన్నారు. రాష్ట్రంలో ఏ.పి. ఎన్.జి. ఓ అసోసియేషన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం వుందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఏ.పి.ఎన్.జి,ఓ అధ్యక్షునిగా చంద్రశేఖరరెడ్డి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించారన్నారు. పదవీ విరమణ చేసిన చంద్రశేఖర రెడ్డి సేవలను విస్తృత పరచేందుకు ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వారధిగా వుంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేసే సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించలాని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. చంద్రశేఖర్ రెడ్డి పూర్తి ఆయురారోగ్యాలతో ఉద్యోగుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక పాలనకు ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం వుందన్నారు. పరిపాలనను ప్రజలకు అందుబాటులో వుంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను ఉద్యోగులు విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రశేఖర రెడ్డి ఎంతో కృషి చేసారని, అదే విధంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బండి శ్రీనివాస రావు పని చేయాలన్నారు.

శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాని ముఖంలో చిరునవ్వు చూడాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలన తరహాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నపరిపాలనకు ఉద్యోగులందరూ సహకరించాలని చేతులు జోడించి కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన చంద్రశేఖర రెడ్డి ప్రజా నాయకుడిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమర్ధవంతంగా కృషి చేయాలని కోరుకుంటున్నామన్నారు.

ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రశేఖర రెడ్డి ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ లో సిటి అధ్యక్షులుగాను, జిల్లా అధ్యక్షులుగాను, స్టేట్ సెక్రటరీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గాను, రాష్ట్ర అధ్యక్షులుగా, ఏ.పి.జే.ఏ.సి చైర్మన్ గాను, ఆల్ ఇండియా ఉద్యోగుల సంఘం ఉపా ధక్ష్యులుగాను సమర్ధవంతంగా విధులు నిర్వహించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఏ.పి.ఎన్. జి.ఓ సంఘంకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత చంద్ర శేఖర రెడ్డి దే అన్నారు. జనరల్ సెక్రటరీ గా పదవ పీఆర్సీ ఏరియర్స్ ఇప్పించడంతో పాటు, ఉద్యోగులకు అవసరమైన అన్ని సమస్యలను పరిష్కరించారన్నారు. ఆడగకుండానే ఉద్యోగులకు 27 శాతం ఐ ఆర్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ కు ఉందన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్ టి సి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశారన్నారు. ఉద్యోగుల పక్షపాతి అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. కొంత మంది అధికారుల తప్పిదాల వలన సి ఎఫ్ఎం ఎస్ లో జీతాలు పెండింగ్ లో పడుతున్నాయని, దానిని వెంటనే సరి చేయాలని కోరుతున్నామన్నారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కరోనా వలన ఎన్ని కష్టాలు వున్నా, ప్రజలకు సంక్షేమ పధకాలు చేరవేస్తున్న విధంగానే, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పదకొండవ పీఆర్సి ని మెరుగైన ఫిట్మెంట్ ని ఒక నెల రోజులలోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన చంద్రశేఖరరెడ్డి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు శాసన మండలి సభ్యునిగా అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు.

ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ జైళ్ళ శాఖలో ఉద్యోగిగా 36 సంవత్సరాలు పని చేసిన కాలంలో 35 సంవత్సరాలు ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేశానన్నారు. ఉద్యోగిగా పని చేస్తూ శలవు దినాలు అన్ని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకే వినియోగించడం జరిగిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యలు పరిష్కారం చేయడంతో వచ్చిన తృప్తి మరి దేనిలో వుండదన్నారు. ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ లో హైదరాబాదు సిటి అధ్యక్షునిగా ప్రారంభమైన నా ప్రస్తానం ఉద్యోగులకు అండగా వుంటూ వారి సంక్షేమం కోసం పనిచేస్తూ అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో ఉన్నారని, మంచి పిఆర్సి , సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలైజేషన్ అంశాలను తప్పనిసరిగా పరిష్కరించే మనస్తత్వం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ద్వారా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను సాధించుకుంటామన్నారు. ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సైతం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్ని పధకాలకు ఉద్యోగులు చేదోడు వాదోడుగా వుంటూ ముందుకు సాగాలని అభ్యర్దిస్తున్నామన్నారు. పదవీ విరమణ చేసినా, ఉద్యోగుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం అన్ని వెళలా పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ పురుషోత్తమ నాయుడు, జే.ఏ.సి జనరల్ సెక్రటరీ హృదయ రాజు, ఫ్యాక్టో చైర్మన్ జోసఫ్ సుధీర్ బాబు, టి.ఎన్.జి.ఓ సహా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ లో వివిధ స్థాయిలలో 35 సంవత్సరాలు చంద్ర శేఖర రెడ్డి విశేషమైన కృషి చేశారన్నారు. ఉద్యోగుల సమస్యలను చట్ట సభలలో వినిపించే విధంగా చంద్రశేఖర రెడ్డి కి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేలా పదవి ఇవ్వాలని కోరుతున్నామన్నారు.

ఏ.పి.ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయకుండానే వినతి పత్రాలతోనే వారి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిష్కరిస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాల సారధిగా వారి సమస్యలను పరిష్కరించడంలో ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ నాయకులుగా చంద్రశేఖర రెడ్డి విశేషమైన కృషి చేశారన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నామన్నారు.

సభలో ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లమారు చంద్ర శేఖర్ రెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, ఏ.పి.ఎస్.ఎఫ్.ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన రెడ్డి గజ మాలతో ఘనంగా సన్మానించి, సన్మాన పత్రం, మెమోంటో ను అందించారు. ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఏ.పి.ఎన్.జి.ఓ రాష్ట్ర నాయకులు, ఏ.పి.జే.ఏ.సి నాయకులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా, తాలుకా శాఖల అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎన్.జి.ఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.వి. రమణ, వై ప్రాసాద్ యాదవ్, దస్తగిరి రెడ్డి, ఎం. పరమేశ్వర రావు, నాగాకిశోర్, మహిళా వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నిర్మల కుమారి, ఆల్ ఇండియా ఉద్యోగుల సంఘం సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్రంలోని పదమూడు జిల్లాలోని జిల్లా, తాలుకా శాఖల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *