అన్న‌దాత‌ల‌కు అండగా పంట నష్టాల నివారణకు చర్యలు

– పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి
– శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎదురైన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పంట నష్టాల అంచనాను వాస్తవ పరిస్థితుల ఆధారంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. తిరువూరు మండ‌లం, మ‌ల్లెల గ్రామంలో ప‌ర్య‌టించారు. గ్రామంలోని వరి పొలాలను సందర్శించి, గాలులకు నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. పంట ఏ దశలో ఉందో, ఎంత విస్తీర్ణంలో పైరు పడిపోయిందో, దిగుబడి, ధాన్యం నాణ్యతపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందో వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట పొలాల్లో నిలిచిన మురుగునీటిని వెంటనే బయటకు తోడేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటంతోపాటు, గింజలు మొలకెత్తకుండా, ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి పంట నేలకొరిగిన పరిస్థితుల్లో గింజలు మొలకెత్తడం, ధాన్యం రంగు మారడం, ఫంగల్‌ సంబంధిత సమస్యలు తలెత్తడం వంటి వాటిని తగ్గించేందుకు పంట పరిస్థితిని బట్టి తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వీటిపై శాస్త్ర‌వేత్త‌లు ఇచ్చే సూచ‌న‌ల‌ను రైతుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. రైతులకు ఎదురైన ఇబ్బందులను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు సరైన సమయంలో సాంకేతిక సూచనలు అందించడం, పంటలను సాధ్యమైనంతవరకు కాపాడుకునేలా మార్గనిర్దేశం చేయడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన సహకారం అందించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట తిరువూరు ఆర్‌డీవో ఎ.కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.