విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
చేనేత, హస్తకళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో విజయవాడలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో ‘వసంతం-2026’ ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి చేనేత డిజైనర్లు, హస్తకళాకారులు పాల్గొని చందేరి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చీరలు, చికన్‌కారీ వస్త్రాలు, కాశ్మీర్ హస్తకళలు, గాజులు, జూటీలు, కార్పెట్లు, ఇతర కళాకృతులను విక్రయించనున్నారు. ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో స్టాళ్లు కోల్పోయిన కళాకారులకు ఈసారి ఉచితంగా స్టాళ్లు కేటాయించి అండగా నిలుస్తున్నారు. నవంబర్ 2న ఉదయం 10.30 గంటలకు నారా బ్రాహ్మణి ప్రదర్శనను ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.
క్రాఫ్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్. రంజన, వైస్ చైర్పర్సన్ బి. సుజాత మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ప్రదర్శనను సందర్శించి కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా సంప్రదాయ చేనేత, హస్తకళలకు ప్రోత్సాహం అందించాలని కోరారు.
విజయవాడలో నవంబర్ 2 నుంచి ‘వసంతం-2026’ హస్తకళల ప్రదర్శన
