విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“సోరియాసిస్ ఉన్నవారిని వివక్షతో చూడకూడదు. అది అంటువ్యాధి కాదు. సరైన చికిత్స, జీవనశైలి మార్పులు, క్రమమైన వైద్య పర్యవేక్షణతో వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇందుకు వ్యాధి గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం” అని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోం లో శనివారం శ్రీ డి.రవి కుమార్ అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన “సోరియాసిస్” అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మన దేశంలో వెయ్యి మందిలో 15మందికి సోరియాసిస్ ఉంటోందన్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చని, సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనబడుతుందన్నారు. సోరియాసిస్ అనేది రోగనిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల కలిగే వాపుతో దీర్ఘకాలికంగా కొనసాగే చర్మవ్యాధి అని అన్నారు. జన్యుపరమైన ప్రభావాలు, రోగనిరోధక వ్యవస్థలో మార్పులు, పర్యావరణ అంశాలు కలిసి సోరియాసిస్‌కు రావడానికి దోహదపడతాయన్నారు. గొంతు ఇన్ఫెక్షన్లు, చర్మంపై గాయాలు, మానసిక ఒత్తిడి, ధూమపానం, అధిక మద్యపానం, ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు, చల్లని వాతావరణం, చర్మం పొడిబారడం, కొన్ని మందుల ప్రభావం సోరియాసిస్ రావడానికి ప్రధాన కారణాలన్నారు. సోరియాసిస్ అంటువ్యాధి కాదని, రోగిని తాకడం, కలిసి కూర్చోవడం, భోజనం చేయడం లేదా కరచాలనం ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపం వల్ల కూడా ఇది రాదన్నారు. చర్మంపై ఎర్రటి లేదా ముదురు రంగు వాపుతో కూడిన మచ్చలు, మచ్చలపై తెల్లటి లేదా వెండి రంగు పొలుసులు, తీవ్రమైన దురద, మంట లేదా నొప్పి, చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడటం, గోళ్లపై చిన్న గుంటలు, రంగు మారడం, మందంగా మారడం లేదా గోరు విడిపోవడం సోరియాసిస్‌లో సాధారణంగా కనిపించే లక్షణాలు అన్నారు. మోచేతులు, మోకాళ్లు, తల చర్మం, నడుము, అరచేతులు, అరికాళ్లు, గజ్జలు, చంకలు, గోళ్లు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని, కొందరిలో శరీరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రావచ్చని అన్నారు. సోరియాసిస్ కేవలం చర్మానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కొందరిలో సోరియాటిక్ ఆర్థరైటిస్, గుండె మరియు జీవక్రియ సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలు, తీవ్రమైన చర్మ సమస్యలు తలెత్తుతాయని అన్నారు. చర్మవ్యాధి నిపుణుడు రోగి లక్షణాలు, వైద్య చరిత్ర, చర్మ పరీక్ష ఆధారంగా సాధారణంగా సోరియాసిస్‌ను నిర్ధారిస్తారని, అవసరమైతే చర్మ బయాప్సీ లేదా ఫంగల్ పరీక్షలు చేయవచ్చని అన్నారు. సోరియాసిస్ చికిత్స వ్యాధి తీవ్రత, ప్రభావిత ప్రాంతాలు, రోగి వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యులు నిర్ణయిస్తారు. చర్మంపై పూసే మందులు, ఫోటోథెరపీ, నోటి ద్వారా తీసుకునే మందులు, బయోలాజిక్ చికిత్సలతో పాటు అనేక ఆధునిక చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. సోరియాసిస్ ఉన్నవారు చర్మం పొడిబారకుండా ప్రతిరోజూ తేమ క్రీములు వాడాలన్నారు. చర్మాన్ని గోకడం, గట్టిగా రుద్దడం చేయకూడదన్నారు. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, ధూమపానం మానడం, అధిక మద్యపానాన్ని నివారించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు తగిన విశ్రాంతి, ధ్యానం వంటి పద్ధతులు పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం సోరియాసిస్ నివారణలో ముఖ్యమైన జాగ్రత్తలన్నారు. ఎక్కువుగా చర్మ ఎర్రదనం, శరీరమంతా పొక్కులు, జ్వరం లేదా అకస్మాత్తుగా వ్యాధి తీవ్రత పెరిగితే తక్షణ వైద్య సహాయం పొందాలన్నారు. స్వీయ చికిత్సలు కాకుండా వైద్య పర్యవేక్షణలోనే చికిత్స పొందాలన్నారు. అనేకమంది పాల్గొన్న ఈ సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేసారు.
సోరియాసిస్ సరైన చికిత్సతో నియంత్రించవచ్చు…
