నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు 75 వేల సదరం స్లాట్లు విడుదల

-నవంబర్‌ 2 నుంచి బుకింగ్ ప్రారంభం
-28 జిల్లాల్లో 117 ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించి 75 వేల స్లాట్లను విడుదల చేయనుంది. నవంబర్‌ 2న ఉదయం 10.30 గంటలకు స్లాట్‌ బుకింగ్ ప్రారంభం కానుంది. సచివాలయాలు, వాట్సాప్‌లోని మనమిత్ర సేవలు, ఏపీ సేవా పౌర సేవా పోర్టల్‌ ద్వారా దివ్యాంగులు స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ), ద్వితీయ ఆరోగ్య శాఖ (డీఎస్‌హెచ్‌) పరిధిలోని 117 ఆసుపత్రుల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపిoది. సాఫ్ట్వేర్ సామర్థ్యం పెంచినందున తొలుత భావించినట్లు 40 వేలకు కాకుండా 75 వేలకు స్లాట్ బుకింగ్ అవకాశాన్ని పెంచారు.

డీఎంఈ, డీఎస్‌హెచ్‌ ఆసుపత్రుల్లో వేర్వేరు రోజుల్లో పరీక్షలు

డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో 21 రకాల దివ్యాంగత్వాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో వారానికి రెండు రోజుల చొప్పున, డీఎస్‌హెచ్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో వారానికి ఒక రోజు చొప్పున పరీక్షలకు స్లాట్లు కేటాయించనున్నారు.

వైద్య పరీక్షలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి

సదరం స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో సంబంధిత వ్యక్తి తనకు ఉన్న దివ్యాంగత్వాన్ని తెలిసిన మేరకు ప్రకటించాలి. లేదా సంబంధిత వైద్యుడి ద్వారా ధ్రువీకరించుకోవాలి. తప్పుడు దివ్యాంగత్వ కేటగిరీలో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే అటువంటి బుకింగ్‌లను పరిగణనలోకి తీసుకోరు.

జోనల్‌ విధానం..

దివ్యాంగులు తమ ప్రాంతానికి సమీపంలోని ఆసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు జోనల్‌ విధానంలో స్లాట్‌ బుకింగ్‌ కొనసాగించనున్నారు

పాత స్లాట్ల తొలగింపునకు ఓటీపీ విధానం

గతంలో బుక్‌ చేసుకున్న పాత స్లాట్లు లేదా సదరం గుర్తింపు సంఖ్యలను తొలగించుకోవాల్సిన వారికి నిర్దేశిత నిబంధనల ప్రకారం ఓటీపీ ఆధారిత సేవ అందుబాటులో ఉంటుంది. బెంచ్‌మార్క్‌ దివ్యాంగత్వం (40 శాతం) కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఓటీపీ ద్వారా అప్పీల్‌ వ్యవస్థలోకి ప్రవేశించి పాత స్లాట్‌ లేదా గుర్తింపు సంఖ్యను తొలగించుకోవచ్చు. ఈ ప్రక్రియలో పాత స్లాట్‌ స్వయంచాలకంగా తొలగిపోతుంది.

స్లిప్పులపై ఆసుపత్రుల సహాయ కేంద్రాల నంబర్లు

స్లాట్‌ బుకింగ్‌ అనంతరం జారీ చేసే అంగీకార స్లిప్పులపై సంబంధిత ఆసుపత్రుల సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లను ముద్రించనున్నారు.

స్లాట్‌ బుక్‌ చేసుకున్న తేదీ నుంచి ఆరు నెలలకు మించి వైద్య పరీక్షలకు హాజరుకాని వారి స్లాట్లు స్వయంచాలకంగా రద్దవుతాయి.

పాత పద్ధతుల్లోనే కాకుండా ఈసారి అదనoగా ఏపీ సేవ పౌర సేవా పోర్టలులోనూ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.