పులివెందులలో ఓటమి భయంతోనే జగన్‌ రాజకీయ డ్రామాలు: కె. బుచ్చి రామ్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పులివెందులలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ వివాదాలకు తెరతీస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ విమర్శించారు. రాజకీయ ఆధిపత్యం తగ్గిపోతుందనే భయంతోనే జగన్‌మోహన్ రెడ్డి ఈ విధమైన డ్రామాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి, ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేసినట్లు తెలిపారు. వాహనాల దహనం ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు.

జరిగిన ఘటనలను యథాతథంగా ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత అని, తమకు అనుకూలంగా వార్తలు రాయలేదని మీడియా ప్రతినిధులను విమర్శించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఎస్సార్ కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి ప్రజలు చరమగీతం పాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును గౌరవించాలని, అధికారం శాశ్వతం కాదని బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. ప్రజల విశ్వాసమే నాయకుడికి అసలైన బలమని, ప్రస్తుత పరిణామాలు జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.