-విజయవాడలోని లయోలా కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని దంపతులు
-వీల్‌చైర్‌లో తల్లిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించిన ఎంపీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని పిలుపునిచ్చారు. విజయవాడలోని లయోలా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆయన సతీమణి జానకీ లక్ష్మి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లిని వీల్‌చైర్‌పై పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి, ఆమెతో కూడా ఓటు వేయించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని, ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు.ముఖ్యంగా వృద్ధుల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పెద్దలు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషకరమని తెలిపారు.గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతానికి సమానంగా ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటు హక్కు వినియోగం కీలకమని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థులకే ఓటు వేయాలి
విజయవాడ నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.నగర అభివృద్ధికి కృషి చేసే, ప్రజల సమస్యలను పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
యువత కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి
ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, యువత కొంత ఆలస్యంగా పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఎంపీ చిన్ని అన్నారు. పోలింగ్ కేంద్రాలు రద్దీగా లేని సమయంలోనే వృద్ధులు ముందుగా వచ్చి ఓటు వేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.యువత కూడా తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు.సాయంత్రం 5 గంటలలోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఓటు వేసి, విజయవాడ అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
