విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఉదయం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో నగరంలోని సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు.
